Digital Arrest | సైబర్ గ్యాంగ్ అరెస్ట్..

Digital Arrest | సైబర్ గ్యాంగ్ అరెస్ట్..

Digital arrest, భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ సైబర్ నేరాలకు పాల్పడే డిజిటల్ అరెస్టు ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు (Police) ఇటీవల అరెస్టు చేశారు. భీమవరానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మ నుంచి సైబర్ నేరగాళ్లు ఇటీవల పలుమార్లు రూ.78 లక్షలు దోచుకున్నారు. దీని పై బాధితుడు శర్మ గత నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి సూచనలతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీసులు వేగవంతమైన ప్రణాళికతో నిందితులను పది రోజులలోనే పట్టుకున్నారు. ఏడు బృందాలుగా విడిపోయి దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ కేసుతో సంబంధం ఉన్న 14 మందిని గుర్తించగా 13 మందిని గన్నవరం, విజయవాడ సమీపంలో అరెస్టు చేశారు.

నిందితుల నుంచి రూ.42 లక్షలు రికవరీ చేయడంతో పాటు వివిధ బ్యాంకుల్లో రూ.19లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. ఈ కేసును త్వరితగతిన చేదించిన పోలీసులకు డిజిటల్ అరెస్టు బాధితుడు రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మ కుటుంబ సభ్యులతో వచ్చి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మిని సాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మిని కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అపరిచిత నెంబర్ నుంచి వచ్చే ఫోన్స్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో ఎక్కడా లేదని, ఇది సైబర్ నేరగాళ్లు ఉపయోగించే ఓ ఆయుధమని అన్నారు. ప్రతి ఒక్కరు తమ బ్యాంకు వివరాలు పిన్ లేదా ఓటీపీ వివరాలను ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో వెల్లడించవద్దని సూచించారు. ఇటువంటి అనుమానాస్పద ఫోన్ కాల్స్ పై వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చేసి తెలియజేయాలని కోరారు. ఈ కేసును ఛేదించిన వారిలో ఒకరైన సీఐ కాళీ చరణ్ ను సత్కరించారు.