ఎన్టీఆర్ బ్యూరో , ఆంధ్రప్రభ, : వైశాఖ పౌర్ణమి సందర్బంగా ఆది దంపతుల గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. వైశాఖ పౌర్ణమి సందర్భంగా సోమవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రి చుట్టూ నిర్వహించిన గిరి ప్రదక్షణ భక్తి ప్రపత్తులతో కొనసాగింది. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిగిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టం అని మన ఇతిహాసాలు చెబుతున్నాయి.
పౌర్ణమి సందర్బంగా సోమవారం ఉదయం ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవముగా ప్రారంభం అయింది. ఆలయ కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కలెక్టర్ వి. కె. శీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు.

వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళవాయిద్యముల, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం సాగినది. ఘాట్ రోడ్ అమ్మవారి గుడి,కుమ్మరి పాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ప్యాక్టరీ, చిట్టినగర్, కొత్త పేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. ఈ గిరి ప్రదక్షిణలు భక్తులు విశేషముగా ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు.