అవినీతి, అక్రమాలతోనే రెండేళ్ల పాలన: దేవినేని అవినాష్

అవినీతి, అక్రమాలతోనే రెండేళ్ల పాలన: దేవినేని అవినాష్

రెండేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమన్న వైసీపీ నేత

‘వెన్నుపోటు’ పాలనకు రెండేళ్లు అంటూ వైసీపీ నిరసన ర్యాలీ

కూటమి మేనిఫెస్టో దహనం చేసిన వైసీపీ శ్రేణులు

2029లో ప్రజలే కూటమికి గుణపాఠం చెబుతారని హెచ్చరిక

విజయవాడ, (ఆంధ్రప్రభ): అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలతోనే కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన కొనసాగించిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. రెండేళ్లలో ఒక్క మంచి పని చేశామని చెప్పుకునే ధైర్యం కూడా కూటమి ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ఈ రెండేళ్ల పాలనపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు కూటమి మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు.

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలను రెండేళ్లు గడిచినా అమలు చేయలేకపోయారని ఆరోపించారు.

నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి కీలక పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అవినాష్ విమర్శించారు. ‘రెడ్‌బుక్’ పేరుతో రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలో రిటైనింగ్ వాల్‌లు, ఫ్లైఓవర్లు, రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థల నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని చెప్పారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణం పేరుతో విజయవాడ ప్రజలను మోసం చేస్తూ నగరాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.

ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా అవినీతి, అక్రమ సంపాదనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించిన అవినాష్, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.