రాజమండ్రి ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
నిందితులకు కఠిన శిక్షలు తప్పవని వెల్లడి
రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ: రాజమండ్రిలో మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని పేర్కొన్నారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని సీఎం తెలిపారు.
ప్రియాంక మృతికి కారణమైన నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు తరలించామని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి నిండు ప్రాణాన్ని బలిగొన్న వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ విషయంలో పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, నిందితులపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి శిక్ష పడేలా చూస్తామని సీఎం వెల్లడించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
