ఉపాధ్యాయులకు మాధ్యాహ్న భోజన విధులు అప్పగించవద్దు
- ఎస్ టియుటిఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ల డిమాండ్
ఉట్నూర్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతలు అప్పగించడాన్ని వెంటనే నిలిపివేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ (ఎస్టీయూటీఎస్) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మూగ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ రవికుమార్ ప్రభుత్వాన్ని కోరారు.
శనివారం వారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడమేనని పేర్కొన్నారు. మిడ్డే మీల్ నిర్వహణ, బియ్యం కొలతలు, సరుకుల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ వంటి పరిపాలనా పనులతో బోధన సమయం వృథా అవుతోందని తెలిపారు.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు బాధ్యతలను ప్రత్యేక సిబ్బందికి అప్పగించి, ఉపాధ్యాయులను పూర్తిగా విద్యా కార్యక్రమాలకే పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. విద్యా ప్రమాణాల పెంపు కోసం ఉపాధ్యాయులపై విద్యేతర పనుల భారం తగ్గించాలని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎస్టీయూటీఎస్ ఆదిలాబాద్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది.
