రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్..

  • 26 ఎకరాల విస్తీర్ణంలో అతి త్వరలో నిర్మాణం
  • ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్
  • అధికారులతో కలిసి స్థల పరిశీలన

గోదావరిఖని, ఆంధ్రప్రభ : రామగుండం నియోజకవర్గం లోని అంతర్గాం ప్రాంతంలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు శాసనసభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. శనివారం తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ వ్యవహారాలకు సంబంధించి ఎమ్మెల్యే సమీక్ష చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు.ఈ ప్రాజెక్టు పనులను త్వరలోనే ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ విద్యాసంస్థ ద్వారా రామగుండం నియోజకవర్గ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అత్యుత్తమ వసతి, శిక్షణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. విద్యా సంస్థ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ఆధునిక సౌకర్యాలతో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో విశాలమైన తరగతి గదులు, అత్యాధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, బాలురు–బాలికలకు ప్రత్యేక హాస్టల్లో నిర్మాణం జరుగుతుందన్నారు. సిబ్బంది నివాస గృహాలు, పేరెంట్స్ వెయిటింగ్ హాల్స్‌తో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఎన్టీపీసీ సంస్థ తన సీఎస్ఆర్ నిధులను రామగుండం నియోజకవర్గ పరిధిలోనే ఖర్చు చేసి, ఈ ప్రాంత విద్య, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలకు మరింత సహకారం అందించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏఈ నరేశ్, ఎంవీఆర్ కన్స్ట్రక్షన్స్ సీఈవో విజయ్ కుమార్, సీనియర్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.