చింతకింది మల్లేశంకు గౌరవ డాక్టరేట్..

ఆలేరు, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లోని అనురాగ్ యూనివర్సిటీ మూడవ స్నాతకోత్సవంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశంకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.

చేనేత మహిళల శ్రమను తగ్గించే లక్ష్యంతో మల్లేశం రూపొందించిన “ఆసు యంత్రం” చేనేత రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని, మహిళల పనిభారం గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించిందని యూనివర్సిటీ గుర్తించింది. ఈ సేవలకు గుర్తింపుగానే గౌరవ డాక్టరేట్ అందజేసినట్లు పేర్కొంది.

ఇంతకు ముందు 2019లో గీతం యూనివర్సిటీ కూడా ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసిన విషయం తెలిసిందే. అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, యూనివర్సిటీ యాజమాన్యం, అధ్యాపకులు, నిర్వాహకులకు మల్లేశం కృతజ్ఞతలు తెలిపారు. స్నాతకోత్సవానికి హాజరైన ప్రముఖులు, అధ్యాపకులు, విద్యార్థులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.