Dehydration | ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ముప్పే…!

Dehydration | ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ముప్పే…!

Dehydration | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వీస్తున్న వడగాల్పులతో జనం బెంబేలెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వేళ వీస్తున్న తీవ్రమైన వడగాల్పుల వల్ల వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఇలాంటి విపత్కర వాతావరణంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా వడదెబ్బ బారిన పడటం ఖాయం. అసలు ఇలాంటి ప్రాణాంతక ఎండల నుంచి మనల్ని కాపాడుకోవాలంటే బయటికి వెళ్లె వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ఈ సమయాల్లో బయటకు రాకండి..

వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో బయటకు వెళ్లడం మానుకోండి. పనులన్నీ ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోండి. బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మీ వెంట ఒక వాటర్ బాటిల్ ఉంచుకోండి. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. ఎండలో బయట తిరిగేటప్పుడు నీరసం రాకుండా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) ద్రావణం లాంటివి తీసుకుంటూ శరీరంలో డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గకుండా) కాకుండా చూసుకోండి.

బయటకు వెళ్లేటప్పుడు ఇవి ధరించండి..

ముదురు రంగు దుస్తులు వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. కాబట్టి లేత రంగులో ఉండే, వదులుగా ఉండే కాటన్ (నలుపు రంగు మినహాయించి) దుస్తులను మాత్రమే ధరించండి. ఎండ నేరుగా తలకు తగలకుండా క్యాప్, హ్యాట్ లేదా కాటన్ క్లాత్ ను స్కార్ఫ్ లా చుట్టుకోండి. గొడుగు వాడటం చాలా ఉత్తమం. కళ్లకు రక్షణగా సన్ గ్లాసెస్ వాడండి.

ఇంట్లో ఉన్నా ఈ జాగ్రత్తలు తప్పనిసరి ..

ఇంట్లో ఉంటున్నాం కదా, ఎండ తగలదు కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఉక్కపోత వల్ల కూడా అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కిటికీలు తెరిచి ఉంచి గాలి ఆడేలా చూసుకోండి. కానీ మధ్యాహ్నం పూట వడగాల్పులు ఇంట్లోకి రాకుండా కిటికీలు మూసివేసి, కర్టెన్లు వేయండి. ఇంట్లో ఉన్నా సరే రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు కచ్చితంగా తాగాలి. ఉక్కపోత ఎక్కువగా ఉంటే రోజుకు రెండుసార్లు చల్లటి నీటితో స్నానం చేయండి. లేదా తడి వస్త్రంతో ఒళ్లు తుడుచుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.

ఆహారంలో చేర్చుకోవాల్సినవి..

మాంసాహారం, మసాలాలు, నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ తగ్గించండి. ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి. దానికి బదులుగా తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. పుచ్చకాయ, కర్భూజ, కీరదోస, టమాటాలు, ఉల్లిపాయలు, నిమ్మకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను మీ డైట్ లో తప్పకుండా చేర్చుకోండి. ఇవి మీ శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.

చిన్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, బీపీ/షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఈ ఎండల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా తీవ్రమైన తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం లాంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే చల్లటి ప్రదేశానికి చేర్చి, నీళ్లు లేదా ఓఆర్ఎస్ తాగించి సమీపంలోని డాక్టర్ వద్దకు తీసుకెళ్లండి. ఎండను నిర్లక్ష్యం చేయకండి.. జాగ్రత్తలు పాటించండి!

Leave a Reply