Electric Shock Death| పొలంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

Electric Shock Death| పొలంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ వైరును సరిచేస్తుండగా విషాదం

పొలంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

జినుగుర్తి గ్రామంలో ఘటన.. విచారణ చేపట్టిన పోలీసులు

తాండూరు రూరల్, ఆంధ్రప్రభ: తాండూరు మండలం జినుగుర్తి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలంలో విద్యుత్ వైరును సరిచేస్తున్న సమయంలో కరెంట్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు.

గ్రామస్తుల కథనం ప్రకారం, జినుగుర్తి గ్రామానికి చెందిన తుంగల జగన్‌ (50) చిన్న చిన్న మెకానిక్ పనులు, కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, ఏఎంసీ డైరెక్టర్ అజ్మత్ అలీ తన పొలంలో పైపులైన్ పనుల కోసం జగన్‌ను తీసుకెళ్లినట్లు సమాచారం.

ఈ క్రమంలో అక్కడ ఉన్న విద్యుత్ వైరును సరిచేసేందుకు జగన్ ప్రయత్నించగా, ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో తీవ్ర షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

మృతుడు జగన్‌కు భార్య అనసూజమ్మ, కుమారుడు మారుతి, కుమార్తె పూజ ఉన్నారు. పూజకు ఇప్పటికే వివాహం జరిగింది.

జగన్ మృతి వార్త తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్ చంద్, గ్రామ సర్పంచ్ చరణ్‌తో పాటు గ్రామ పెద్దలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

Leave a Reply