తాలు తరుగు పేరుతో రైతులను దోచుకోవడం దారుణం
మునుగోడు, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు తరుగు, వెయిటింగ్ చార్జీల పేరుతో రైతులను దోచుకోవడం దారుణమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మండిపడ్డారు. ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
లారీల కొరత పేరుతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేయడం అన్యాయమన్నారు. సీరియల్ ప్రకారం లోడింగ్ చేయకుండా చేతివాటం తీసుకొని ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో దళారులతో కుమ్మక్కై రైతుల పేరుతో ధాన్యం విక్రయిస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రైస్‌మిల్లుల వద్ద లారీలను వెంటనే అన్‌లోడింగ్ చేయకపోవడంతో రవాణా సమస్య తీవ్రంగా మారిందన్నారు.
రైతుల ధాన్యానికి సంబంధించిన డబ్బులను వెంటనే ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 11న కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను రైతులు,పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి,సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం, సలీం,చాపల మారయ్య ,సిఐటియు సభ్యులు ఎల్ రాజు , సిపిఐఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ , మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్ , వేముల లింగస్వామి ,యాట యాదయ్య, కట్ట లింగస్వామి , పగిళ్ల మధు , రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
