నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి..

- ప్రజా భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు..
- క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
- జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ క్షేత్రస్థాయి అధికారులు విస్తృత తనిఖీలతో నిరంతర పర్యవేక్షణ తప్పనిసరని.. అలసత్వానికి తావులేకుండా విధులు నిర్వర్తించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
గురువారం కలెక్టర్ లక్ష్మీశ.. కలెక్టరేట్ నుంచి ఆర్‌డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ పండగల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆలయాల వద్ద పటిష్ట భద్రత, రక్షణ ఏర్పాట్లు, సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పెట్రోలు బంక్‌లు, థియేటర్లు వంటివాటిని కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా చేసిన ఏర్పాట్లను పరిశీలించి.. ఏవైనా లోటుపాట్లు ఉంటే నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకొని, సరిదిద్దుకునేలా చూడాలన్నారు.
మార్గదర్శకాల ప్రకారం అగ్నిమాపక వ్యవస్థలు ఉండాల్సిందేనని.. ప్రజల భద్రతతో ముడిపడిన విషయాల్లో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతిచోటా ప్రజా భద్రతకు సంబంధించి నిర్దేశించిన ప్రమాణాలు పాటించాల్సిందేనన్నారు. చిన్న చిన్న జాగ్రత్తలే పెద్ద విపత్తుల బారినుంచి రక్షిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకొని పకడ్బందీగా తనిఖీలను నిర్వహించి, నివేదికలు పంపాలని ఆదేశించారు.
అదే విధంగా తాగునీటి సరఫరా వ్యవస్థలపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. స్టోరేజ్ ట్యాంకుల విషయంలోనూ నిరంతర పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. శిథిలావస్థ భవనాల విషయంలోనూ నిబంధనలకు అనగుణంగా చర్యలు తీసుకోవాలని కలక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, ఆర్‌డీవోలు కావూరి చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
