Congress | ఆ.. బాధ్యత ప్రభుత్వానిదే..

Congress | ఆ.. బాధ్యత ప్రభుత్వానిదే..
Congress, పత్తికొండ, ఆంధ్రప్రభ : పత్తికొండ నియోజకవర్గంలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన రెండు కీలక ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లుతూ, కాంగ్రెస్ పార్టీ (Congress Party) నియోజకవర్గ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించారు. మాజీ టీటీడీ ఏవీఎస్వో సతీష్ కుమార్ అనుమానాస్పద మరణం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన క్రాంతి నాయుడు, ఈ కేసులో ప్రభుత్వం నిష్పక్షపాత దర్యాప్తు జరపడంతో పాటు బాధిత కుటుంబానికి అనుకూల చర్యలు తీసుకోవాలని కోరారు. సతీష్‌కుమార్ కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా, 5 ఎకరాల భూకేటాయింపు, ఒక కుటుంబ సభ్యునికి గ్రూప్-2 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాయితీగా పని చేసే అధికారులకు ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది అని స్పష్టం చేశారు.
అదే విధంగా 1962లో స్థాపించబడిన పత్తికొండ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌కు శాశ్వత ఆట స్థలం, యాక్టివిటీ స్పేస్ లేకపోవడం విద్యార్థినుల అభివృద్ధికి పెద్ద అడ్డంకి అవుతోందని సూచించారు. పత్తికొండలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించడం.. లేదా అవసరమైతే టీటీడీ (TTD) కళ్యాణమండపం సమీపంలోని ఖాళీ స్థలాన్ని విద్యార్థినుల కోసం క్రీడా మైదానంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలు కప్ గెలిస్తే సంబరాలు చేసుకోవడం కాదు… గ్రామీణ బాలికలకు సమాన క్రీడా అవకాశాలు కల్పించే విధానమే నిజమైన ప్రోత్సాహం అని గుర్తు చేశారు.
ఇక జొన్నగిరి గోల్డ్ మైన్స్ లో జరుగుతున్న అక్రమాలు, పత్తికొండ పరిధిలో జరుగుతున్న కబ్జాల పై సమగ్ర నివేదిక ఇవ్వాలని పలుమార్లు కోరినా స్పందన లేకపోవడం పై క్రాంతి నాయుడు ఆర్డీఓను ప్రశ్నించారు. ఈ అంశాల పై తక్షణ స్పందనతో పారదర్శక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్, రహంతుల్లా, కృష్ణ, రాముడు తదితరులు పాల్గొన్నారు.
