అత్యాధునిక వైద్య సేవలకు సీఎం చంద్రబాబు శ్రీకారం
రూ.1.70 కోట్లతో సీటీ స్కాన్ కేంద్రం..
మూత్రపిండ శుద్ధి కేంద్రం ప్రారంభం
నివారణే ఆరోగ్య సంరక్షణకు మూలం..
ప్రతి పౌరుడి ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి: సీఎం
కుప్పం, ఆంధ్రప్రభ: స్వర్ణ కుప్పం దార్శనిక ప్రణాళిక–2029లో భాగంగా కుప్పం ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో రూ.1.70 కోట్ల వ్యయంతో భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) సామాజిక బాధ్యత నిధులతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ఆధారిత శరీర చిత్రీకరణ (సీటీ స్కాన్) కేంద్రాన్ని, అపోలో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూత్రపిండ శుద్ధి (డయాలసిస్) కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, వైద్య పరికరాలు, రోగులకు అందుతున్న చికిత్స, సంజీవని కార్యక్రమం అమలు తీరును పరిశీలించి వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు.

సీటీ స్కాన్ కేంద్రాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి, ఈ కేంద్రం ద్వారా కుప్పం, పరిసర ప్రాంతాల ప్రజలకు మెదడు, ఛాతీ, ఉదర భాగాలకు సంబంధించిన వ్యాధులను అత్యాధునిక సాంకేతికతతో స్థానికంగానే గుర్తించే అవకాశం కలుగుతుందని అధికారులు వివరించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స ప్రారంభించవచ్చని తెలిపారు.
మూత్రపిండ శుద్ధి కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులతో ముఖ్యమంత్రి మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 45 వేలకుపైగా డయాలసిస్ చికిత్సలు అందించగా, ప్రస్తుతం 233 మంది నిరంతర చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. రోజుకు మూడు విడతల్లో సుమారు 45 మందికి చికిత్స అందిస్తున్నామని, మరో 500 మంది వరకు వేచి ఉన్నందున సేవలను మరింత విస్తరించాలని సీఎం సూచించారు. కర్ణాటక, బెంగళూరు, కృష్ణా జిల్లా తదితర ప్రాంతాల నుంచి కూడా రోగులు ఇక్కడికి రావడం సేవల నాణ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.

అనంతరం సంజీవని ప్రదర్శనలను పరిశీలించిన ముఖ్యమంత్రి, ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలు ఒకేచోట అందుబాటులో ఉండే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల సమాచారాన్ని సమగ్రంగా అనుసంధానం చేసి ప్రతి పౌరుడికి ఒకే ఆరోగ్య చరిత్ర నమోదయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే వ్యాధులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుని ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం ముఖ్యమని చంద్రబాబు అన్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పర్యావరణ పరిస్థితుల ప్రభావాన్ని సమగ్రంగా విశ్లేషించి ప్రజారోగ్య విధానాలు రూపొందించాలని సూచించారు. రోగులు మందులు సక్రమంగా తీసుకుంటున్నారా, చికిత్స కొనసాగిస్తున్నారా అనే అంశాలను కూడా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నియంత్రిస్తే అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు.
సంజీవని ప్రదర్శనల్లో అత్యవసర పరిస్థితుల్లో రోగి ఆరోగ్య వివరాలను వెంటనే వైద్యులకు చేరవేసే ఆరోగ్య గుర్తింపు పత్రం, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కృత్రిమ మేధస్సు ఆధారిత రక్త పరీక్ష పరికరం, దృష్టిలోపం ఉన్న చిన్నారుల విద్యకు ఉపయోగపడే సహాయక పరికరాలు, చిన్నారుల్లో మెదడు ఎదుగుదల లోపాలను ముందుగానే గుర్తించే వ్యవస్థ వంటి ఆవిష్కరణలను పరిశీలించి సంబంధిత ప్రతినిధులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
కొత్త ఆలోచనలు రూపొందించడం మాత్రమే కాకుండా వాటి ద్వారా ప్రజలకు ఎంత ప్రయోజనం కలిగింది, ఎంతమంది ఆరోగ్యవంతులయ్యారు, ఎంత వ్యాధి భారం తగ్గింది, ఎంత వైద్య ఖర్చు ఆదా అయిందనే ఫలితాలను స్పష్టంగా చూపించాలని ముఖ్యమంత్రి సూచించారు. కుప్పాన్ని దేశానికే ఆదర్శ ఆరోగ్య నమూనాగా తీర్చిదిద్దుతూ నివారణ ఆధారిత వైద్య సేవలు, శాస్త్రీయ విధానాలు, సమాచార విశ్లేషణ, ఆధునిక సాంకేతికతను మరింత విస్తరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
