ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి
ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి
- మిల్లుల్లో అన్లోడింగ్ పెంచాలని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశం
చిట్యాల, ఆంధ్రప్రభ : రబీ ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. మిల్లుల వద్ద అన్లోడింగ్ పెంచడంతో పాటు వాహనాల రోటేషన్, కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని సూచించారు. లారీలు, హమాలీల సంఖ్యను పెంచాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం ఆయన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రానికి ఇప్పటివరకు వచ్చిన ధాన్యం వివరాలు, హమాలీలు, ట్రక్ షీట్లు, మిల్లులకు ట్యాగ్ చేసిన వాహనాలు, టార్పాలిన్లు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు ఈ కేంద్రానికి 25 వేల క్వింటాళ్ల ధాన్యం వచ్చిందని, అందులో 7 వేల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తయ్యిందని, ప్రస్తుతం కేంద్రంలో సుమారు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. పెద్దకాపర్తి పెద్ద కేంద్రం కావడంతో అదనంగా 10 నుంచి 20 వరకు లారీలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. హమాలీల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, ప్రతి కేంద్రంలో సుమారు 30 మంది హమాలీలు, మిల్లుల్లో 30 నుంచి 35 మంది వరకు పనిచేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ట్యాబ్ ఎంట్రీ 100 శాతం పూర్తి కావాలని, ధాన్యాన్ని శుభ్రపరిచే డ్రయ్యర్లు, ఇతర సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్ల లభ్యతను సమీక్షించి అవసరమైతే అదనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అనంతరం వట్టిమర్తి గ్రామంలోని సిద్ధార్థ రైస్ ఇండస్ట్రీస్‌ను సందర్శించి, అక్కడ హమాలీల సంఖ్య, అన్లోడింగ్, వాహనాల రోటేషన్‌పై ఆరా తీశారు. సిస్టమ్ ద్వారా ధాన్యం వివరాల అప్‌లోడింగ్, ట్యాబ్ ఎంట్రీలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రతిరోజూ ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
ట్యాబ్ ఎంట్రీ పెండింగ్‌లో ఉన్న కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మిల్లుల్లో స్థలం లేకుంటే ఇంటర్మీడియట్ గోదాములకు తరలించాలని సూచించారు. ధాన్యం తరలింపును వేగవంతం చేయడానికి మరిన్ని వాహనాలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌పోర్ట్ శాఖ డిప్యూటీ కమిషనర్ వాణిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ రోహిత్ సింగ్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జీఎం నాగేశ్వరరావు, ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ వాణి, డీఎం రాంపతి నాయక్, డీసీఓ పత్యా నాయక్, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, తహసీల్దార్ విజయ్, సర్పంచ్ కాటం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
