శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉంచుకుందాం..

శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉంచుకుందాం..

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమం…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లాలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం పరిపాలనాభవనము వద్ద శనివారం స్వచ్ఛఆంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమం ఘనంగా చేపట్టారు.దేవస్థానం ఉపకార్యనిర్వహణాధికారి ఆర్. రమణమ్మ, దేవస్థానంలోని ఆయా శాఖల యూనిట్ అధికారులు, పలు విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది ఈ ప్రతిజ్ఞ కార్యక్రమములో పాల్గొని స్వచ్ఛఆంధ్ర ప్రతిజ్ఞను చేశారు.

ముందుగా దేవస్థానం అధికారులు మాట్లాడుతూ “జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్” వ్యర్థ రహిత సంస్థలు అనే థీమ్‌తో ఈ రోజు పలుచోట్ల ఈ కార్యక్రమం చేపట్టబడిందన్నారు. ఇందులో ప్రతి సంస్థ స్థాయిలోనే తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేరుచేయడం లాంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. తడి చెత్తను తగు విధంగా ప్రాసెస్ చేయడం ద్వారా సేంద్రియ ఎరువులుగా మార్చడం, పొడివ్యర్థాలను శాస్త్రీయంగా సేకరించి రీసైక్లింగ్‌కు పంపించి ఆదాయవనరులుగా మార్చడం, ప్రమాదవ్యర్థాలను విడిగా సేకరించి సంబంధిత సంస్థలకు అప్పగించడం మొదలైన అంశాలు ఉన్నాయన్నారు.

అదేవిధంగా వర్షపు నీటినిల్వ కోసం కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను శాస్త్రీయంగా రూపొందించుకునే అంశం కూడా ఉందన్నారు. తరువాత దేవస్థానం సిబ్బంది అందరు కూడా నిర్ధిష్ట నమూనాలోని స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయడం జరిగింది. పరిసరాల పరిశుభ్రం కొరకు ప్రతీరోజు కొంత సమయం కేటాయించ బడుతుందని, స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండటం జరుగుతుందని, తోటివారికి కూడా “స్వచ్ఛతపై అవగాహన కల్పించడం జరుగుతుందని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి, రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని ప్రతిజ్ఞ చేశారు.” అనంతరం క్షేత్రపరిధిలోని విస్తృత పారిశుద్ద్య కార్యక్రమం చేపట్టబడిందన్నారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.