అక్రమ నిర్మాణాలకు రేట్ ఫిక్స్..
అక్రమాలకు టౌన్ ప్లానింగ్ అధికారులే అండ
భీమవరంలో మాఫియాగా అక్రమ నిర్మాణాలు..
సమస్యల వలయంలోకి జిల్లా కేంద్రం
అధికారుల నిర్లక్ష్యంతో భవిష్యత్తు అంధకారం
నిఘా విభాగం, భీమవరం : అక్రమ నిర్మాణాల ప్రోత్సాహమే లక్ష్యంగా ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు పనిచేస్తున్నారు. ప్రతి అక్రమ నిర్మాణానికి, నిబంధనలు పాటించలేని భవనాలకి ఫిక్స్డ్ రేట్లు ఇక్కడ పెట్టేశారు. వారు పెట్టిన ఫిక్స్డ్ రేట్ కి అంగీకరిస్తేనే ఆగ మేఘాలపై అడ్డదారిలో అనుమతులను మంజూరు చేసేస్తుంటారు.
ఒకవేళ అనుమతులు మంజూరు కాకపోయినా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేలా కన్నెత్తి చూడకుండా వ్యవహారాలను నడిపిస్తూ ఉంటారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో అక్రమ నిర్మాణాలు పూర్తి అదుపు తప్పిపోయాయి. భీమవరం మధ్యలో ఉన్న మున్సిపల్ కార్యాలయం టౌన్ ప్లానింగ్ కార్యాలయాలకు సమీపంలోని ఈ అక్రమ వ్యవహారాల తంతు సాగుతున్న వారికి మాత్రం కంటికి కనిపించవు.

జాతీయ రహదారి, రాష్ట్ర రహదారులు, ప్రధాన రహదారుల్లో, ప్రధాన వీధుల్లో సెట్బ్యాక్లు లేకుండా, అనుమతులకు మించి భారీ భవనాలు శరవేగంగా నిర్మాణం అవుతున్నాయి. సాధారణ ప్రజలు ఇంటి ప్లాన్‌కు సవాలక్ష ఆంక్షలు విధించే అధికారులు వారు చెప్పిన రూట్లో వెళ్తే మాత్రం ఎటువంటి ఆంక్షలు లేకుండా తాపీగా పనులు జరిగేలా చూస్తారు.
అన్ని సమర్పించుకుంటేనే భారీ నిర్మాణదారులకు టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు కళ్లు మూసుకొని కూర్చుంటారు. లేకుంటే తమకు పైనుంచి ఒత్తిడి వస్తుందని, తాము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బెదిరింపులకు పాల్పడతారు. అధికారుల తనదానికి జిల్లా కేంద్రమైన భీమవరాన్ని సమస్యల వలయంలోకి నెట్టేస్తున్నారు భీమవరం భవిష్యత్తును ట్రాఫిక్ వలయం అనే అంధకారంలోకి గెంటేస్తున్నారు.
మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే అక్రమ నిర్మాణాలు
భీమవరం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఈ అక్రమాల దందా నిరాటంకంగా కొనసాగుతుంది. పై అధికారులు ప్రశ్నిస్తారనే భయం లేదు, ప్రజా ప్రతినిధులు నిలదీస్తారని జంకు లేకుండా ఇక్కడ వ్యవహారాలు సాగుతున్నాయి. నిత్యం అధికారులు సంచరించే ప్రధాన రోడ్లపైనే అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఈ అక్రమ భవంతులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కనీసం సెట్ బ్యాక్‌లు లేకుండా, ప్లాన్‌కు సంబంధం లేకుండా భవనాలు కట్టేస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
అనుమతులు ఇచ్చేముందు సైట్‌ను పరిశీలించి సెట్బ్యాక్లు ఉన్నాయో లేవో తనిఖీ చేయాల్సి ఉన్నా.. ఆ పని మాత్రం ఇక్కడ అధికారులు చేయరు. క్షేత్రస్థాయి పరిశీలన చేసిన దానిని వారికి అనుకూలంగా మార్చుకొని మాట్లాడుకుని వెళ్లిపోతూ ఉంటారు. అందుకే తనిఖీలు నామమాత్రంగానే సాగుతున్నాయి. భీమవరం టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై ఇప్పటికే విమర్శల పరంపర కొనసాగుతున్నాయి. నివాస గృహ అనుమతి తీసుకొని షాపింగ్ మాల్ తరహా వాణిజ్య భవనాలు ఇక్కడ నిర్మించేస్తున్నారు. వాస్తవ అనుమతులకు మించి నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
అంతా అస్తవ్యస్తం..
అధికారుల నిర్లక్ష్య వైఖరి వారి ధన దాహానికి జిల్లా కేంద్రమైన భీమవరం టౌన్ ప్లానింగ్ విషయంలో హస్తవ్యస్తంగా మారుతుంది నిబంధనలను పాటించని నిర్మాణాలతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి నిర్మిస్తున్న భవనాలతో భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఫైర్ ఇంజన్ వెళ్లే మార్గం కూడా లేని ప్రాంతాల్లో కూడా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
నిర్మాణాల మధ్య సెట్ బ్యాక్‌లు వదలకుండా కట్టేస్తుండటంతో ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు తక్షణం చర్యలు చేపట్టుకుంటే జిల్లా కేంద్రం ట్రాఫిక్ సమస్యలకు, ప్రమాదాలకు నిలయంగా మారే పరిస్థితి ఉంది. భీమవరంలో అక్రమ నిర్మాణాలు ఇలా కొనసాగితే పట్టణ అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
