కార్గిల్ అమరవీరులకు కేఎల్ యూనివర్సిటీలో ఘన నివాళి
తాడేపల్లి, ఆంధ్రప్రభ : కేఎల్ యూనివర్సిటీలోని 10 ఆంధ్రా, 22 ఆంధ్రా ఎన్‌సీసీ బెటాలియన్ల ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్‌ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమర వీర జవాన్లకు విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, ఎన్‌సీసీ క్యాడెట్లు ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విశ్వవిద్యాలయ అధికారులు కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు మన సైనికులు చేసిన త్యాగాలు ప్రతి భారతీయుడికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం వంటి విలువలను యువత అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎన్‌సీసీ క్యాడెట్లు దేశభక్తిని ప్రతిబింబించే ప్రసంగాలు, గేయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అమర వీర జవాన్లకు తమ గౌరవాన్ని చాటుకున్నారు. అనంతరం అమర జవాన్ల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. భారత సైన్యం దేశ భద్రత కోసం నిరంతరం అందిస్తున్న సేవలను కొనియాడుతూ విద్యార్థులు చేసిన “జైహింద్“ నినాదాలతో ప్రాంగణం మారుమోగింది.
కార్గిల్ విజయ్ దివస్ నిర్వహణ ద్వారా యువతలో దేశభక్తి భావనను మరింత పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ జి. పార్ధసారధి వర్మ, ప్రో వైస్ చాన్సలర్లు డాక్టర్ ఎన్. వెంకట్ రామ్, డాక్టర్ కె. రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.ఐ. పవన్ కుమార్, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్‌చార్జి డీన్ డాక్టర్ కె.ఆర్.ఎస్. ప్రసాద్, సలహాదారు డాక్టర్ హబీబుల్లా ఖాన్, ఎన్‌సీసీ అధికారులు లెఫ్టినెంట్ డాక్టర్ వి. మౌనిక, డాక్టర్ దారా విక్రమ్, 10(ఏ) సీటీఓ డాక్టర్ శశికళ, డాక్టర్ సుభాకర్ రాజు, అధ్యాపకులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, వివిధ విభాగాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమర వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు.
