Chintana | రామాయణం.. అంతర్దర్శనం


వ్యక్తి ప్రస్థానం అవ్యక్తం నుండి అవ్యక్తం దాకా సాగడమే. కర్మానుభవాన్ని పొందడం కోసం అవ్యక్తమైన అపరిమితత్వం నుండి పరిమితులతో కూడిన వ్యక్తంగా అవతరించడమే పుట్టుక. భౌతిక జీవన పరిమితులను అధిగమించి అపరిమితత్వంలో లయం కావడమే మరణం. గమ్యం గమనం నిర్ణయమయ్యాక జరిగేది పుట్టుక.. కాగా గమ్యం చేరాక కలిగేది మరణం. పుట్టుకకు మరణానికి మధ్య సాగేది జీవనం.
కాలాలు మూడు.. భూత, భవిష్యత్‌, వర్తమానాలు. భూత కాలం జ్ఞాపకాలకు, అనుభవాలకు సంబంధించినది. భవిష్యత్తు ఆశయాలకు, దర్శనానికి సంబంధించినది. వర్తమానం భూతకాల అనుభవాలను ప్రాతిపదికగా తీసుకొని భవిష్యదాశయ సాధనకు ఉద్యమించేందుకు ఉద్దేశించినది. మూడు కాలాలలో జీవించే వ్యక్తి జీవితం రసమయమౌతుంది.


సత్యము, ధర్మము ఉఛ్ఛ్వాస నిశ్వాసాలుగా కర్తవ్యపాలన చేతనగా ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపిన అవతార పురుషులలో శ్రీరాముడు అగ్రగణ్యుడు. రాముని జననం పునర్వసు నక్షత్రం. పునర్వసు అంటే మళ్ళీ మళ్ళీ క్షేత్రజ్ఞుని రూపంలో శరీరంలో నివసించేదని. అదే భగవత్తత్వం. దానినే విష్ణువు, శివుడు అంటారు. సృష్టి నిరంతర స్రవంతిలో సమస్యలు తలెత్తినప్పుడు దానిని సరిచేసేందుకు భగవంతుడు అవతరిస్తాడు. అలా అవతరించిన రాముని నడక రామాయణం. నారదుడు ప్రేరణగా వాల్మీకి ముఖంద్వారా వేదమే రామాయణంగా అవతరించింది. స్వాధ్యాయం, వాక్సంపద, గాంభీర్యాలను తపస్సు ద్వారా సాధించిన వాడు వాల్మీకి. నారద వాల్మీకుల సంకల్పానికి బ్ర#హ్మ ఆశీస్సులు జత కలిసాయి. రామాయణగాథ సజీవమై మానవగాథగా జగత్తులో నిలిచిపోయింది.


అయోధ్య అంటే జయింపరానిది. దానికి ప్రభువు దశరథుడు. పది దిక్కులకు పయనించు రథము కలిగినవాడు, దశరథుడు. రథమంటే శరీరమే. తాత్వికంగా పది ఇంద్రియాలను ఆవరించిన మనస్సు అనే రథ మునకు ఆయన ప్రతీక. అతనికి ముగ్గురు భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. త్రిగుణాలకు వీరు ప్రతీకలు. సత్వగుణానికి కౌసల్య, రజోగుణానికి కైకేయి, తమోగుణానికి సుమిత్ర ప్రతీకలు. కౌసల్య నేర్పరితనాన్ని, కైకేయి సమస్యలను, సుమిత్ర సమన్వయాన్ని సూచిస్తున్నాయి. దశరథునికి సంతానం కలగలేదు. పురుషప్రయత్నం విఫలమైంది.. దైవాన్ని ఆశ్రయించాడు. పుత్రకామేష్టిని సంకల్పించాడు.. సంకల్పంలో స్వార్థం ఉన్నది.. ప్రజా#హతమూ ఉన్నది. స్వార్థం.. తన వంశం నిలవాలి.. ప్రజా#హతం.. రాజ్యానికి ధార్మికుడైన ప్రభువు రావాలి.. అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసాన్ని ఇచ్చాడు.

విష్ణువు రామునిగా అవతరించాడు. ఆ అవతరణకు ప్రయోజనాలు రెండు. ఒకటి యజ్ఞఫలంగా దశరథునికి సంతానాన్ని ఇవ్వడం.. రెండు దైవకార్యంగా రాక్షససంహారం చేయడం. అందుకే పాయసం రెండుగా విభజితమయి కౌసల్య, కైకేయిలకు ఇవ్వబడింది. రామ భరతులు జనించి అవతార ప్రయోజనాన్ని పంచుకున్నారు. రాముడు రాక్షస సంహారానికి బయలుదేరాడు.. భరతుడు రాజ్యాన్ని పాలించాడు. సుమిత్రకు ఆ ఇరువురూ పాయసంలో భాగమిచ్చారు. ఆమెకు కౌసల్య భాగంలో లక్ష్మణుడు, కైకేయి భాగంతో శత్రుఘ్నుడు జన్మించారు. రాముడు ధర్మానికి, భరతుడు భక్తికి, లక్ష్మణుడు శ్రద్ధకు, శత్రుఘ్నుడు శక్తికి ప్రతీకలు. ధర్మాచరణకు శ్రద్ధ అవసరం.. అందుకే రాముని వెంట లక్ష్మణుడు ఉంటాడు. అలాగే.. భక్తికి కవచంలాంటిది శక్తి. అందుకే భరతుని వెంట శత్రుఘ్నుడు ఉంటాడు.


సీతారామ కళ్యాణమనే కార్యానికి శివధనుర్భంగం కారణమయింది. రాక్షస సంహారమనే కార్యానికి సీతాకళ్యాణం కారణమయింది. అద్భుతమైన శక్తి, అచంచలమైన భక్తి, ఆహ్లాదకరమైన రక్తి రామాయణంలో త్రిగుణాలుగా భాసిల్లుతున్నాయి. రామునికి కైక అప్పటివరకూ ఒక అవకాశం.. మంథర బోధ ఆమెను సమస్యగా మార్చింది. మంథర కైకతో అనుక్షణం ఉండే వ్యక్తియే. ఈర్ష్య, అసూయ, వ్యామో#హం, లాలస, లోభత్వం, పట్టుదలలు మంథర రూపంలో మనిషిలో స#హజంగా ఉండేవే. మ#హనీయులు దానిని అధిగమిస్తారు.. సామాన్యులు వాటికి లొంగిపోతారు. కైక మంథర బోధలకు లొంగిపోయింది.. రామావతార ప్రయోజనం సిద్ధించింది.


శాపోప#హతుడైన రావణుడు రామస్వామి రాకకై ఎదురుచూచాడు. రావణుని శాప మోక్షమనే కార్యానికి సీతాప#హరణ కారణమయింది. సీత తన వశమయితే రావణుడు ప్రకృతిని జయించిన పురుషుడౌతాడు. అలా ప్రకృతిని జయించని నాడు సీతలోని ఆర్తి తన శాప విమోచనకు కారణమౌతుంది. జీవుని వేదన ముక్తికి సాధనమయింది. వైరభక్తిలో శిక్షయే వరమయింది.
ఉదాత్తమయిన రామాయణ కావ్యాన్ని తాత్వికంగా దర్శించగలిగితే.. ఒక్కొక్కరి దృష్టి కోణం వారికి మ#హత్తరమైన ర#హస్యాలను బోధిస్తుంది.

— పాలకుర్తి రామమూర్తి

Leave a Reply