Women’s Cricket | నేడు మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌

ఆస్ట్రేలియా–ఇంగ్లాండ్ అమీతుమీ!
ఏడో ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా..
17 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలన్న పట్టుదలతో ఇంగ్లాండ్
విజేతకు రూ.22 కోట్లకు పైగా ప్రైజ్ మనీ..
రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌

Women’s Cricket | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నాలుగు వారాలుగా క్రికెట్ అభిమానులను అలరించిన మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు ఆదివారం తెరపడనుంది. ప్రపంచ క్రికెట్‌కు ప్రతిష్ఠాత్మక వేదికగా పేరొందిన లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఆతిథ్య ఇంగ్లాండ్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఈ రెండు జట్లు ట్రోఫీ కోసం సమరానికి సిద్ధమయ్యాయి.

మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో అత్యంత ఉత్కంఠభరితమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇంగ్లండ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు, భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరగా, ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికాపై 40 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ టోర్నీలో రెండు జట్లు కూడా అజేయంగా నిలవడం ఫైనల్‌కు మరింత ఆసక్తిని తీసుకొచ్చింది. ఇప్పటికే ఆరు సార్లు మహిళల టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా ఏడో టైటిల్‌పై కన్నేసింది. మరోవైపు 2009లో తొలిసారి ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్, 17 ఏళ్ల తర్వాత మరోసారి ప్రపంచ విజేతగా నిలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై జరుగుతున్న ఫైనల్ కావడంతో ఇంగ్లాండ్‌పై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి.

విజేతకు రూ.22 కోట్లకు పైగా ప్రైజ్ మనీ
ఈ ఫైనల్‌లో విజేతగా నిలిచే జట్టుకు 23.40 లక్షల అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.22 కోట్లకు పైగా) ప్రైజ్ మనీ అందనుంది. రన్నరప్ జట్టుకు 11.70 లక్షల అమెరికన్ డాలర్లు (సుమారు రూ.11 కోట్లకు పైగా) లభిస్తాయి. మహిళల క్రికెట్‌ను మరింత ప్రోత్సహించే దిశగా ఐసీసీ ఈసారి కూడా భారీ ప్రైజ్ మనీని కొనసాగించింది. ప్రపంచ మహిళల క్రికెట్‌లో రెండు అగ్రశ్రేణి జట్లు తలపడుతున్న ఈ ఫైనల్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. చారిత్రాత్మక లార్డ్స్ వేదికపై ట్రోఫీని ఎవరు ముద్దాడతారో అన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.