రైతులకు అండగా కూటమి ప్రభుత్వం..

875 నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభం

యూరియా కొరత లేకుండా చర్యలు..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో రైతులకు భరోసా : ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 875 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో రైతులకు ఎలాంటి కొరత లేకుండా యూరియా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. యూరియా సరఫరా కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన యాప్ విధానంపై ప్రతి రైతు అవగాహన పెంచుకొని అధికారులకు సహకరించాలని కోరారు.

ఎల్-నీనో ప్రభావంతో ఈ ఏడాది ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆచార్య ఎన్.జీ. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, సలహాలను రైతులు పాటించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూటమి ప్రభుత్వం వెన్నంటి నిలుస్తుందని, రైతులు ధైర్యంగా వ్యవసాయం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వంలో రైతుల భూముల సరిహద్దు రాళ్లపై, పట్టాదారు పాస్ పుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి ఫొటో ముద్రించడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ప్రవేశపెట్టి భూ సమస్యలను జటిలం చేయడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేయడంతో పాటు ప్రభుత్వ రాజముద్రతో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తూ రైతులకు సంపూర్ణ భరోసా కల్పిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, ఎంపీపీ తుంగల సుమతి, తహసీల్దార్ బీ. అంకాలు, ఎంపీడీఓ మరియాదేవి, మాజీ సర్పంచ్ పండ్రాజు లంకమ్మ ప్రసాద్, ఎంపీటీసీ కటికల వసంత్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.