వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సత్యకుమార్ పర్యటన

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సత్యకుమార్ పర్యటన
- కాలువల ఆక్రమణలపై తీవ్ర ఆగ్రహం.. సమగ్ర సర్వేకు ఆదేశం
- రహదారుల మరమ్మతులు, పారిశుధ్య పనులపై మున్సిపల్ అధికారులకు తక్షణ ఆదేశాలు
- వీధి వ్యాపారులతో ముచ్చటించి భరోసా కల్పించిన మంత్రి
ధర్మవరం, ఆంధ్రప్రభ:
ధర్మవరం పట్టణంలో ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖామాత్యులు, స్థానిక ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ఉదయం పట్టణంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. రహదారులపై బురద పేరుకుపోవడం, డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉండటం, కాలువలు ఆక్రమణలకు గురికావడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం అందుకున్న వెంటనే మంత్రి క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు.
ధర్మవరం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఆయన ఎస్.ఎల్.వి. మార్కెట్, కే.పి.టి స్ట్రీట్, శ్రీదేవి హాల్ రోడ్, తోగట వీధి, అంజుమన్ సర్కిల్, జట్కా స్టాండ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
పర్యటనలో భాగంగా శ్రీదేవి హాల్ సమీపంలోని ప్రధాన ఇరిగేషన్ కాలువ పరిస్థితిని చూసి మంత్రి తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు సుమారు 15 అడుగుల వెడల్పుతో ఉన్న కాలువ, ప్రస్తుతం ఆక్రమణల కారణంగా కేవలం ఒకటిన్నర అడుగుకు కుదించబడటాన్ని ఆయన గుర్తించారు. దీనిపై తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించి, స్పష్టమైన మార్కింగ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని, కాలువలను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పట్టణ పారిశుధ్యంపై మంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని, అవసరమైన ప్రాంతాల్లో డస్ట్బిన్లు ఏర్పాటు చేసి రెగ్యులర్ క్లీనింగ్ చేపట్టాలని సూచించారు. రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలు ఆక్రమణలకు గురికాకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అలాగే అంజుమన్ సర్కిల్ పరిసరాల్లో గుంతలుగా మారిన రహదారులకు వెంటనే ప్యాచ్‌వర్క్‌లు చేపట్టి, ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయాలన్నారు. వర్షాకాలంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలకు దారితీస్తుందని, అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పర్యటన అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ అంజుమన్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతాల్లోని వీధి వ్యాపారుల వద్దకు వెళ్లి, వారితో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, ప్రజా సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి భరోసా ఇచ్చారు. ధర్మవరాన్ని శుభ్రమైన, సౌకర్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు.
