అలంపూర్ జోగులాంబ శక్తిపీఠంలో శ్రీచక్ర స్థిర ప్రతిష్ఠ

  • శృంగేరి జగద్గురువారి ఆధ్వర్యంలో చారిత్రాత్మక మహోత్సవం
  • వైదిక పద్ధతిలో శ్రీచక్ర మహాయంత్ర ప్రతిష్ఠ

అలంపూర్, ఆంధ్రప్రభ: భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ ఆలయంలో గురువారం చారిత్రాత్మక ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారి సన్నిధానంలో శ్రీ జోగులాంబ అమ్మవారి గర్భగృహంలో శ్రీచక్ర మహాయంత్ర స్థిర ప్రతిష్ఠను వైదిక సంప్రదాయంలో ఘనంగా నిర్వహించారు.

ఆలయ సంప్రదాయం ప్రకారం సుమారు పన్నెండు శతాబ్దాల క్రితం జగద్గురు ఆది శంకరాచార్యులు సనాతన ధర్మ పునరుద్ధరణ యాత్రలో భాగంగా అలంపూర్ క్షేత్రాన్ని సందర్శించి, ఉగ్ర స్వరూపంలో వెలసిన జోగులాంబ అమ్మవారిని శాంత స్వరూపిణిగా ఆరాధించే విధంగా శ్రీచక్ర మహాయంత్రాన్ని ప్రతిష్ఠించినట్లు స్థలపురాణంలో పేర్కొంటారు. అదే గురుపరంపరను అనుసరిస్తూ శృంగేరి జగద్గురువారు శ్రీచక్ర స్థిర ప్రతిష్ఠను నిర్వహించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏడవ శతాబ్దంలో బాదామి చాళుక్యుల పాలనలో అభివృద్ధి చెందిన ఈ క్షేత్రం, అనంతరం బహమనీ సుల్తానుల దండయాత్రల సమయంలో దెబ్బతిన్నప్పటికీ, శృంగేరి జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వాముల ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యాధిపతి హరిహరరాయలు ద్వితీయుడు క్షేత్రాన్ని రక్షించినట్లు చరిత్ర చెబుతోంది. తరువాత ఆలయాన్ని పునర్నిర్మించి జోగులాంబ అమ్మవారిని మూలస్థానంలో తిరిగి ప్రతిష్ఠించారు.

అలంపూర్ జోగులాంబ మహాక్షేత్రానికి శృంగేరి శారదాపీఠంతో శతాబ్దాలుగా అవినాభావ సంబంధం ఉంది. ఆలయ పునర్నిర్మాణం అనంతరం పూజా విధానాలు, ఆగమ సంప్రదాయాలు, ఆలయ నిర్వహణ వంటి అంశాల్లో శృంగేరి పీఠం నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తోంది. గతంలో పలువురు శృంగేరి పీఠాధిపతులు ఈ క్షేత్రాన్ని సందర్శించగా, ప్రస్తుత జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు 1989లో దర్శించారు. అనంతరం ఉత్తరాధికారిగా ఉన్న జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు 2018లో, తిరిగి ఈ ఏడాది మార్చిలో క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అధికారులు, భక్తుల విజ్ఞప్తిని మన్నించి శ్రీచక్ర ఆరాధనకు శాశ్వత రూపం కల్పించాలనే సంకల్పంతో 2026 జూలై 2న జగద్గురువారు స్వయంగా శ్రీచక్ర మహాయంత్ర స్థిర ప్రతిష్ఠను నిర్వహించారు. అంతకుముందు రోజు సాయంత్రం అలంపూర్ చేరుకున్న మహాస్వామివారు గర్భగృహంలో రత్నన్యాస కార్యక్రమాన్ని నిర్వహించి, యాగశాల, కర్మమండపాలు, ప్రతిష్ఠించబోయే శ్రీచక్రాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీ చంద్రమౌళీశ్వర పూజ నిర్వహించారు.

ప్రతిష్ఠకు ముందు శృంగేరి శారదాపీఠానికి చెందిన ఋత్వికులు శాస్త్రోక్తంగా జపాలు, హోమాలు, ఇతర వైదిక క్రతువులను నిర్వహించారు. నిర్ణీత శుభముహూర్తంలో శ్రీచక్ర మహాయంత్రాన్ని గర్భగృహంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.