నైపుణ్యమే ప్రధానం..
నైపుణ్యమే ప్రధానం..
ప్రధాన మంత్రి రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని
గుంటూరు, ఆంధ్రప్రభ : యువత కేవలం సర్టిఫికెట్లపై ఆధారపడకుండా నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోగలుగుతారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వ్యవస్థలో మార్పు తీసుకురాగల శక్తి యువతలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.
శనివారం గుంటూరులోని రైల్వే భవన్లో నిర్వహించిన ‘ప్రధాన మంత్రి రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనేది కొత్త విషయం కాకపోయినా, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తూ పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా నియామకాలు చేపట్టడం ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువత దేశానికి భారం కాకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు కష్టపడి చెల్లించే పన్నుల ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయనే విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

ఉద్యోగంలో చేరిన తర్వాత తమ శాఖల్లో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దే దిశగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని యువతకు పిలుపునిచ్చారు. నమ్మిన సిద్ధాంతాన్ని నిజాయితీగా అమలు చేస్తూ ముందుకు సాగితేనే వ్యక్తిగత విజయంతో పాటు దేశ ప్రగతికి కూడా తోడ్పాటు అందించగలమన్నారు. ఉద్యోగుల మైండ్‌సెట్‌లో మార్పు వచ్చినప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్–తెలంగాణ ప్రాంతాలకు రైల్వే బడ్జెట్ కేవలం రూ.800 కోట్ల వరకే పరిమితమైందని, ప్రస్తుతం 2026-27 బడ్జెట్లో ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రూ.10 వేల కోట్లకు పైగా కేటాయించడం ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి దృష్టికి నిదర్శనమన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ వేగంగా జరుగుతోందని తెలిపారు.
2013లో మంజూరైన నందివెలుగు ఆర్ఓబీ పనులు గత ప్రభుత్వ కాలంలో ఐదేళ్లపాటు నిలిచిపోయాయని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు సమీకరించి పనులను మళ్లీ ప్రారంభించామని గుర్తుచేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 1.65 లక్షల పోస్టాఫీసుల ద్వారా గతంలో రూ.200 కోట్లుగా ఉన్న ఆదాయాన్ని ప్రస్తుతం రూ.2 వేల కోట్లకు పెంచగలిగామని వివరించారు.
కార్యక్రమం అనంతరం రైల్వే, పోస్టల్, బ్యాంకింగ్ తదితర శాఖల్లో ఎంపికైన నూతన ఉద్యోగులకు పెమ్మసాని చంద్రశేఖర్ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం సుధేష్ణ సేన్‌తో పాటు రైల్వే, పోస్టల్, బ్యాంకింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
