ధర్నా సక్సెస్ చేయాలని పిలుపు..
తాడ్వాయి, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, సోమవారం తాడ్వాయిలో నిర్వహించనున్న రైతు ధర్నాలో రైతులందరూ పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, మాజీ సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల గడువును వెంటనే పొడిగించాలని డిమాండ్ చేశారు. పాల ధరలను తగ్గించి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే రూ.500 బోనస్‌ను తక్షణమే చెల్లించాలని కోరారు.
ఇంకా, రెండు లక్షల రుణమాఫీ ఇప్పటికీ అందని రైతులు ఉన్నారని, వారికి వెంటనే పూర్తి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జాప్యం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.
మండల కేంద్రంలో సోమవారం నిర్వహించే మహా ధర్నాకు రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రైతుల ఐక్యతను చాటాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పులగం సాయి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ముధాం నరసింహులు, గోపాల్ రావు, రమేష్ రావు, సాయి రెడ్డి, పిసు రాజిరెడ్డి, సంజీవులు, మెట్టు రాము పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు మైలారం రవీందర్ రెడ్డి, మంగారెడ్డి, చంద్రారెడ్డి, తాజుద్దీన్, కొరివి నర్సింలు, సంజీవరెడ్డి, ఆంజనేయులు, మైపాల్, రాజిరెడ్డి, కృష్ణమూర్తి తదితర నాయకులు హాజరయ్యారు.
