సమయపాలన పాటించని ఏడిఏ కార్యాలయం సిబ్బంది
- అధికారుల పర్యవేక్షణ కరువు
- ఇష్టానుసారంగా విధులకు హాజరు
- కార్యాలయానికి పనుల కోసం వచ్చిన వారు ఎదురుచూపులు
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో విధులు నిర్వహించే సిబ్బంది సమయపాలన పాటించకుండా ఇష్టాను రీతిలో విధులకు హాజరవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరకాల డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ ఏవో కార్యాలయ సమయానికి హాజరు కావాల్సి ఉన్నప్పటికి శనివారం రోజు 11 గంటలు దాటినప్పటికీ కూడా కార్యాలయంలోని గదులకు తాళాలు వేసి ఉండడాన్ని, సరైన సమయానికి వీధిలోకి హాజరు కాని సిబ్బంది పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ శాఖలో ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా పట్టణంలోని వ్యవసాయ శాఖ ఏడిఏ కార్యాలయంలోని సిబ్బంది ఇష్టాను రీతిలో విధులకు హాజరు కావడం జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి వివిధ పనులపై వచ్చేవారు కార్యాలయంలోని గదులకు తాళాలు వేసి ఉండడాన్ని చూసి వెనుతిరిగిపోవడం జరుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సిబ్బంది హాజరు తీరును పరిశీలించాలని, కార్యాలయ సమయానికి సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
