ఆర్థిక సంస్కరణల ఆద్యుడు పీవీ: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్, ఆంధ్రప్రభ: ప్రపంచంలో భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలవడానికి మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. స్వర్గీయ ప్రధాని పీవీ 105వ జయంతి సందర్భంగా హనుమకొండ బస్టాండ్ సమీపంలోని పీవీ విగ్రహం వద్ద ఆదివారం నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశాయన్నారు.
ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో పుట్టిన పీవీ దేశ ప్రధాని స్థాయికి ఎదగడం జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. దేశ గమనాన్ని మార్చిన ధీశాలిగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ మరియు ఇతర ప్రముఖులు పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ఛాహాత్ బాజ్‌పాయ్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్ రావు, పీవీ మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
