మంథనిలో దళిత యువకుడి దారుణ హత్య కలకలం

మంథని, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఆదివారం ఉదయం మంథని మండలం గాడిదల గండి సమీపంలో కుళ్లిన స్థితిలో ఆయన మృతదేహం లభ్యమైంది.
ఏప్రిల్ 30వ తేదీ నుంచి వంశీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు మూడు, నాలుగు రోజుల అనంతరం గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి కాల్ డేటా ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని విచారించినట్లు సమాచారం. అనంతరం ఆమె భర్తను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.
లవ్ ఎఫైర్‌నే హత్యకు కారణమా?

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, సింగిరెడ్డిపల్లికి చెందిన వంశీ అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడిపినట్లు తెలిసింది. అయితే ఆ యువతి అనంతరం మరొకరిని ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది.
ఇటీవల గ్రామ దేవతల కొలుపు సందర్భంగా ఆ యువతి తిరిగి గ్రామానికి రావడంతో వంశీతో మళ్లీ ఫోన్ సంభాషణలు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న యువతి భర్త, ఆమె ద్వారానే వంశీని ఏప్రిల్ 30న హైదరాబాద్‌కు పిలిపించి హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం.
హత్య అనంతరం మృతదేహాన్ని మంథని సమీపంలోని గాడిదల గండిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగి సుమారు పది రోజులు కావడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో లభ్యమైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
