ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పూర్తి పారదర్శకత
45 రోజుల్లో నిర్మాణం ప్రారంభించాలి..
ప్రతి సోమవారం బిల్లుల విడుదల: కలెక్టర్ కోయ శ్రీహర్ష
రామగుండం, (ఆంధ్రప్రభ): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతోందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం ఎన్టీపీసీ కాకతీయ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రామగుండం నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీలుగా విభజించి, గెజిటెడ్ అధికారుల పరిశీలన అనంతరం ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతోనే మంజూరు ఉత్తర్వులు జారీ అవుతాయని వివరించారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎల్-1 జాబితాలోని 449 మందికి ఇళ్లు మంజూరైనా, 184 మంది మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారని తెలిపారు. మంజూరైన లబ్ధిదారులు 45 రోజుల్లోపు నిర్మాణం ప్రారంభించాలని, లేనిపక్షంలో నిబంధనల ప్రకారం మంజూరు రద్దయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. అయితే రద్దుకు ముందు ప్రజాప్రతినిధుల ద్వారా లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుసుకుంటామని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బిల్లులు ప్రతి సోమవారం విడుదల చేస్తున్నామని, నిర్మాణ పురోగతిని ఆన్‌లైన్‌లో నమోదు చేసిన మేరకు చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. ఇటీవల అందిన 1,312 దరఖాస్తుల్లో విచారణ అనంతరం 607 మంది ఎల్-1 కేటగిరీలో అర్హులుగా గుర్తించామని, వారి దరఖాస్తుల పరిశీలనను వారం రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు.
