మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఏసీపీ
జైపూర్, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలు, ముఖ్యంగా యువత చురుకుగా భాగస్వాములు కావాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
సోమవారం జైపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు.
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడంతో పాటు తమ స్నేహితులు, సహచరుల్లో కూడా అవగాహన కల్పించాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కట్టుబడి ఉన్నారని, అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.
జూన్ 26న నిర్వహించే మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏసీపీ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై భూమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యాంసుందర్, గ్రామ సర్పంచ్ కూన భాస్కర్, ఉప సర్పంచ్ ఇరిగిరాల శ్రావణ్, మాజీ ఎంపీటీసీ మంతెన లక్ష్మణ్, అంబల్ల రవి తదితరులు పాల్గొన్నారు.
