మక్తల్‌లో మెగా ఉచిత వైద్య శిబిరం..

ప్రజలకు అరుదైన వైద్య సేవలు

యశోద హాస్పిటల్ నిపుణులచే పరీక్షలు.. సద్వినియోగం చేసుకోవాలని బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి పిలుపు

మక్తల్, ఆంధ్రప్రభ: బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29న మక్తల్ పట్టణంలోని నెహ్రూగంజ్ మార్కెట్ యార్డులో నిర్వహించనున్న మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గవినోళ్ల బాలకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌కు చెందిన యశోద హాస్పిటల్ నిపుణులచే నిర్వహించే ఈ వైద్య శిబిరంలో గుండె సంబంధిత వ్యాధులు (కార్డియాలజీ), చిన్నపిల్లల వ్యాధులు (పీడియాట్రిక్స్), మహిళల వ్యాధులు (గైనకాలజీ), ఎముకల సంబంధిత వ్యాధులు (ఆర్థోపెడిక్స్), కంటి వ్యాధులు (ఆప్తాల్మాలజీ)తో పాటు వివిధ విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

అలాగే బ్లడ్, షుగర్ పరీక్షలు, ఈసీజీ, 2డీ ఈకో వంటి వైద్య పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు, కంటి అద్దాలు కూడా అందజేస్తామని వెల్లడించారు.

ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఈ నెల 29న ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారని తెలిపారు. మక్తల్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిబిరాన్ని విజయవంతం చేయాలని గవినోళ్ల బాలకృష్ణారెడ్డి కోరారు.