ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బందులు
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బందులు
-మాజీ మంత్రి దయాకర్ రావు
తొర్రూరు, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మక్క రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లోని మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కొనుగోళ్లలో జాప్యంపై రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ… రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటలు సాగు చేశారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పంట దళారుల చేతికి వెళుతుందని తెలిపారు. మక్క రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, మక్కల కొనుగోలు ఆలస్యం చేయడం వల్ల అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఒకవైపు మద్దతు ధర లేక నష్టపోతుంటే, మరోవైపు అకాల వర్షాలకు మార్కెట్ యార్డుల్లో, కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న తడిచిపోయి రైతులు కన్నీరు పెడుతున్నారని తెలిపారు.
కొనుగోళ్లలో జాప్యం ఎందుకు జరుగుతుందో ప్రభుత్వం తెలపాలన్నారు.మొక్కల కొనుగోలు కేంద్రాల వద్ద బస్తాలు లేకపోవడంతో రైతులే సొంతంగా తెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతుంటే మొక్కజొన్నలో తేమ ఉందంటూ తరుగు తీయడం దారుణమన్నారు.బడ్జెట్లో పంటల బీమా గురించి గొప్పగా ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని చెప్పారు. ఈ ప్రభుత్వం అటు పంటల బీమా అమలు చేయదు,ఇటు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వదని మండిపడ్డారు.
మొక్కజొన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీని వెంటనే వర్తింపజేయాలని, మద్దతు ధర రూ.2400 తోపాటు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు ఈనెల 6న వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే రైతు సభకు భారీగా తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు,మాజీ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్,మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్, నాయకులు ఎం.కాలు నాయక్, చామకూరి ఐలయ్య,కుర్ర శ్రీనివాస్,అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి,రాయిశెట్టి వెంకన్న,ధరావత్ జై సింగ్, బాలు నాయక్, రమేష్ నాయక్,సురేష్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.
