Bhiksheshwara Temple | మోక్షాన్ని ప్రసాదించే భిక్షేశ్వరుడు–గౌతమేశ్వరుడు..
Bhiksheshwara Temple | మంథని, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా మంథని… గోదావరి తీరాన వెలసిన ప్రాచీన పుణ్యక్షేత్రం. ఒకప్పుడు వేద విద్యకు కేంద్రబిందువుగా, ఋషుల తపోభూమిగా వెలుగొందిన ఈ ప్రాంతం అనేక పురాణ, చారిత్రక విశిష్టతలను సొంతం చేసుకుంది. ‘మంత్రకూటం’, ‘మంత్రపురి’గా ప్రసిద్ధి చెందిన మంథని, నేటికీ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంటూ వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది.
శాస్త్రాల ప్రకారం మంథని క్షేత్రం అనాది కాలం నుంచే అత్యంత పవిత్రమైన శైవక్షేత్రంగా పేరుగాంచింది. విశ్వమే పరమేశ్వరుని ఆలయమైతే, అందులో పూజామందిరమే మంథని క్షేత్రమని పురాణాలు వర్ణిస్తాయి. గలగల పారే గౌతమీ (గోదావరి) నది తీరాన పరమేశ్వరుడు శైలేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, భిక్షేశ్వరుడు, గౌతమేశ్వరుడు అనే నాలుగు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తాడని విశ్వాసం.
పశ్చిమాభిముఖ భిక్షేశ్వరుడు.. కాశీ తర్వాత ప్రత్యేకత..
మంథనిలోని శ్రీ భిక్షేశ్వరస్వామి ఆలయం దేశంలోని అరుదైన శివాలయాల్లో ఒకటి. సాధారణంగా శివాలయాలు తూర్పు ముఖంగా నిర్మిస్తారు. అయితే ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండటం దీని ప్రత్యేకత. కాశీ విశ్వనాథ ఆలయం తర్వాత పశ్చిమాభిముఖంగా వెలసిన ప్రముఖ శివాలయంగా భిక్షేశ్వరుడి ఆలయానికి విశిష్ట స్థానం ఉంది.
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, దక్షిణామూర్తి లింగరూపంలో కొలువై ఉండటం. శివలింగం పశ్చిమాభిముఖంగా ఉండగా, అదే గర్భగుడిలో దక్షిణాభిముఖంగా దక్షిణామూర్తి దర్శనమిస్తారు. ఈ విశిష్టత దేశంలో మరెక్కడా కనిపించదని ఆలయ సంప్రదాయాలు చెబుతున్నాయి.
భిక్షేశ్వరుడికి అభిషేకం చేస్తే శని దోషాలు తొలగి, విద్య, జ్ఞానం, ఉద్యోగం, సర్వకార్యసిద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుంటారు. శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
ధ్వజస్తంభం లేని అరుదైన ఆలయం..
భిక్షేశ్వరస్వామి ఆలయంలో మరో ప్రత్యేకత ధ్వజస్తంభం లేకపోవడం. సాధారణంగా ప్రతి హిందూ ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుంది. అయితే భిక్షేశ్వరుడి ఆలయంలో అది లేకపోవడం ఈ క్షేత్రాన్ని మరింత విశిష్టంగా నిలబెట్టింది.
గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన గౌతమేశ్వరుడు..
మంథనిలోని మరో ప్రముఖ దేవాలయం శ్రీ గౌతమేశ్వరస్వామి ఆలయం. గౌతమ మహర్షి స్వయంగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. మాఘమాసంలో ఇక్కడ స్నానాలు, దానధర్మాలు చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
గోదావరి ఆవిర్భావానికి సంబంధించిన పురాణగాథ..
పురాణాల ప్రకారం పార్వతీదేవి, గంగాదేవి మధ్య జరిగిన సంఘటనల నేపథ్యంలో గణపతి యుక్తితో గౌతమ మహర్షికి గోహత్య దోషం అంటుకున్నట్లు జరిగింది. ఆ పాప విమోచన కోసం గౌతముడు పరమేశ్వరుడిని ప్రార్థించగా, శివుడు గంగాదేవిని భూమిపై ప్రవహింపజేశాడు. ఆ పవిత్ర ప్రవాహమే గోదావరి నదిగా ప్రసిద్ధి చెందిందని పురాణ కథనం.
గంగాదేవి కోరిక మేరకు పరమేశ్వరుడు ఈ ప్రాంతంలో శివలింగరూపంలో వెలిశాడని, గౌతమ మహర్షి ఆ లింగాన్ని ప్రతిష్ఠించి గంగాజలంతో అభిషేకించారని చెబుతారు. అందుకే ఈ ఆలయానికి “గౌతమేశ్వరుడు” అనే పేరు వచ్చింది.
ఉత్తరవాహినిగా ప్రవహించే గోదావరి..
మంథని క్షేత్రం వద్ద గోదావరి నది ప్రత్యేకంగా ఉత్తరదిశగా ప్రవహిస్తుంది. ఉత్తరవాహినిగా ప్రవహించే నదీతీరాలు హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే ఈ ప్రాంతంలో పితృకర్మలు, తీర్థస్నానాలకు విశేష ప్రాధాన్యం ఉంది.
ఎలా చేరుకోవాలి?
మంథని పట్టణం పెద్దపల్లి జిల్లాలో ఉంది. రామగుండం నుంచి సుమారు 40 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 60 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో సులభంగా చేరుకునే సౌకర్యం అందుబాటులో ఉంది.
వేద సంప్రదాయం, పురాణ వైభవం, ఆధ్యాత్మిక విశిష్టత, గోదావరి మహిమ ఒకేచోట దర్శనమిచ్చే పవిత్ర క్షేత్రంగా మంథని భిక్షేశ్వరుడు–గౌతమేశ్వరుడు ఆలయాలు తెలంగాణలో ప్రముఖ శైవ పుణ్యక్షేత్రాలుగా భక్తుల విశ్వాసాన్ని చాటుతున్నాయి.
