తక్కువ ప్రీమియం ఆఫర్లా? తస్మాత్ జాగ్రత్త!

  • ఇన్సూరెన్స్ మోసాలను గుర్తించేదెలా?

ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఆరోగ్య, జీవిత, వాహన నష్టాల వంటి ఊహించని ఆర్థిక నష్టాల నుంచి భద్రత కల్పించే ఒక రక్షణ కవచం. అయితే, ఈ భద్రతా వలయాన్ని మోసగాళ్లు తమ అక్రమ నిధుల స్వాహాకు ఆసరాగా వాడుకుంటున్నారు. ఇన్సూరెన్స్ మోసం అంటే తక్కువ ప్రీమియంలు లేదా పరిమిత-సమయం డిస్కౌంట్ల పేరుతో మోసం చేసి, బాధితుల నుంచి నిధులను రాబట్టడం.

ఈ మోసాలు ప్రధానంగా నకిలీ ఆఫర్లు, ఒరిజినల్‌ని పోలిన నకిలీ ఇన్సూరెన్స్ వెబ్‌సైట్లు, సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే ఫిషింగ్ ఇమెయిల్స్, పేమెంట్స్‌ను మోసగాళ్ల వ్యక్తిగత ఖాతాలకు మళ్లించే UPI & డిజిటల్ పేమెంట్ స్కామ్‌ల రూపంలో జరుగుతున్నాయి. చట్టబద్ధమైన పేమెంట్ లింక్‌లుగా నమ్మబ‌లికి… మోసగాళ్ల వ్యక్తిగత UPI లింక్‌లకు డబ్బు పంపేలా అమాయకులను మోసం చేయడం ఈ స్కామ్‌లలో సర్వసాధారణం.

మోసాలను గుర్తించే ముఖ్య హెచ్చరికలు

ఇన్సూరెన్స్ మోసాన్ని గుర్తించేందుకు కొన్ని సాధారణ హెచ్చరికలు ఉన్నాయి. “పరిమిత-కాల ఆఫర్లు” వంటి అధిక ఒత్తిడి వ్యూహాలు లేదా పాలసీ రద్దు బెదిరింపులు, UPI లేదా వ్యక్తిగత ఖాతాల ద్వారా చెల్లింపులు చేయమని కోరడం, సరైన భద్రత (HTTPS) లేని వెబ్‌సైట్‌లు, అలాగే OTPలు, UPI పిన్‌లు లేదా బ్యాంక్ వివరాలు వంటి సున్నితమైన సమాచారం కోసం అయాచిత కాల్‌లు లేదా సందేశాలు రావడం. వంటివి వ‌స్తే అవి మోస‌పూరిత‌మ‌ని గుర్తించాలి.

సురక్షితంగా ఉండటానికి సైబర్ నిపుణుల చిట్కాలు

ఈ మోసాల బారిన పడకుండా ఉండటానికి, వినియోగదారులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ సంస్థల హిస్టరీ, ఆర్థిక స్థితి, లైసెన్స్‌లు , కస్టమర్ రివ్యూలను పరిశీలించి, వాటి చట్టబద్ధతను ధృవీకరించుకోవాలి. ప్రీమియం పేమెంట్ల కోసం నగదు చెల్లింపులను పూర్తిగా నివారించి, ఆన్‌లైన్ పోర్టల్ లేదా కార్డ్ చెల్లింపుల వంటి సురక్షిత పద్ధతులను మాత్రమే ఉపయోగించాలి. అలాగే, పాలసీకి సంబంధించిన నిబంధనలను జాగ్రత్తగా సమీక్షించి, దాని చట్టబద్ధతను నిర్ధారించుకోవాలి. వ్యక్తిగత డేటాను విశ్వసనీయ వనరులతో మరియు సురక్షిత మార్గాలతో మాత్రమే పంచుకోవాలని గుర్తుంచుకోవాలి.

మోసానికి గురైతే ఎలా ?

ఒకవేళ మీరు PhonePe ద్వారా ఇన్సూరెన్స్ మోసానికి గురైతే, వెంటనే PhonePe యాప్‌లో, లేదా కస్టమర్ కేర్ నంబర్‌లకు (080–68727374 / 022–68727374) కాల్ చేయడం ద్వారా లేదా వారి అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో నివేదించాలి. అంతేకాకుండా, మోసపూరిత ఫిర్యాదులను సమీపంలోని సైబర్ క్రైమ్ సెల్‌లో లేదా ఆన్‌లైన్‌లో https://www.cybercrime.gov.in/ లో నమోదు చేయవచ్చు. సైబర్ క్రైమ్ సెల్ హెల్ప్‌లైన్ నంబర్ 1930ను సంప్రదించవచ్చు. అనుమానాస్పద సందేశాలు లేదా కాల్‌లను సంచార్ సాథి పోర్టల్‌లోని చక్షు సౌకర్యం ద్వారా టెలికమ్యూనికేషన్స్ శాఖకు (DOT) కూడా తెలియజేయవచ్చు.