మంత్రి పొంగులేటి చేతుల మీదుగా ఉత్తమ ఆశా అవార్డు
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు హనుమకొండ జిల్లా యంత్రాంగం అవార్డులను ప్రదానం చేసింది. ఇందులో ఎల్కతుర్తి గ్రామానికి చెందిన జంపాల రాధిక ఉత్తమ ఆశా కార్యకర్తగా అవార్డు అందుకున్నారు.
శనివారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చౌహాన్ బాజ్పేయి, అదనపు కలెక్టర్ రవి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా జంపాల రాధిక అవార్డును అందుకున్నారు.
ప్రజలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండటంతో పాటు గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆమె చూపిన పనితీరును గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జంపాల రాధిక మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నానని తెలిపారు.
తన సేవలను ప్రభుత్వం గుర్తించి అవార్డు అందించడం మరింత బాధ్యతను పెంచిందన్నారు. భవిష్యత్తులోనూ ఎల్కతుర్తి గ్రామపంచాయతీ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అవార్డు అందుకోవడంపై వైద్యాధికారి రాజశేఖర్, పీహెచ్సీ సిబ్బంది, ఎంపీడీవో విజయ్ కుమార్, సర్పంచ్ మునిగడప లావణ్య, గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, సహచర ఆశా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ రాధికను అభినందించారు.
