Five Years of Taliban Rule-The Lash of Restrictions-Afghan women Isolated From Society| ఆంక్షల కొరడా.. సమాజానికి దూరంగా మహిళలు
Five Years of Taliban Rule-The Lash of Restrictions-Afghan women Isolated From Society| ఆంక్షల కొరడా.. సమాజానికి దూరంగా మహిళలు
ఆఫ్ఘానిస్తాన్‌ను 2021 ఆగస్టు 15న అమెరికా సైన్యం వీడిన రోజు. తాలిబన్ల పాలన కూడా ప్రారంభమైన రోజు కూడా. అక్కడ ప్రభుత్వం విధించి వంద ఆంక్షాలతో మహిళలు సమాజానికి దూరమవుతున్నారు. మాధ్యమిక , ఉన్నత విద్యను నిషేధించారు. ఉపాధిని పరిమితం చేశారు. తండ్రి, సోదరుడు, భర్త లేకుండా మహిళ సంచరించకూడాదు. పరాయి మగవాడితో మాట్లాడినా.. ప్రేమలో పడినా బహిరంగ శిక్షకు అర్హురాలు. ఆ విధంగా కొరఢా దెబ్బతిన్న మహిళలు కూడా లేకపోలేదు. దీనిపై సమ్రగ విశ్లేషణ…
- ఆఫ్ఘానిస్తాన్‌లో మహిళలు కోరుకునేది భవిష్యత్తు కాదు..
- ఆ దేశంలో బతకడమే ఓ కల
- ఐదేళ్ల తాలిబాన్ల పాలనలో వంద ఉత్తర్వుల జారీ
- చదువు లేదు.. స్వేచ్ఛ లేదు.. మిగిలింది ఆశ ఒక్కటే!
- ఆ ఆశే వాళ్లను బతికిస్తుంది!
Five Years of Taliban Rule- Afghan Women Face – Silent Humanitarian Crisis | ఆంధ్రప్రభ వెబ్ , అంతర్జాతీయ ప్రతినిధి : ఆఫ్ఘానిస్తాన్‌ను 2021 ఆగస్టు 15న అమెరికా సైన్యం వీడిన రోజు. స్వదేశీయులకు పగ్గాలు అందుకున్న రోజు కూడా. స్వదేశీయుల పాలనలో స్వర్ణయుగం చూస్తామని ఊహించిన అక్కడ మహిళలకు నరకమే చూడాల్సి వస్తోంది. ఇదీ ఆప్ఘానిస్తాన్‌లో మహిళల మాట.
ఆఫ్ఘానిస్థాన్‌లో యుద్ధం ముగిసిందని ప్రపంచం భావించినా.. అక్కడి మహిళల జీవితాల్లో మాత్రం మరో యుద్ధం మొదలైంది. అది బుల్లెట్లతో కాదు.. చట్టాలతో… తుపాకులతో కాదు.. ఆంక్షలతో…
చదువు నుంచి ఉద్యోగం వరకు.. స్వేచ్ఛ నుంచి ఆశ వరకు అన్నింటిపైనా ఆంక్షలు
‘మాకు భవిష్యత్తు కాదు.. బతకడమే ఇప్పుడు కల’ అంటున్నారు అక్కడ మహిళలు!
ఒకటి అక్కడి మహిళల గొంతు.. మరొకటి ఐక్యరాజ్యసమితి సర్వేలు ఐదేళ్ల తాలిబాన్ పాలనలో ఆఫ్ఘానిస్తాన్ ఎంత లోతైన మానవ హక్కుల సంక్షోభంలో ఉందో స్పష్టమవుతోంది.
యుద్ధం ముగిసింది.. కానీ మహిళల స్వేచ్ఛ కూడా ముగిసింది
2021 ఆగస్టు 15న అమెరికా సైన్యం ఆఫ్ఘానిస్తాన్‌ను వీడిన రోజు తాలిబాన్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై 100కు పైగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్య, ఉపాధి, ప్రయాణం, ఆరోగ్యం, న్యాయం.. జీవితంలోని ప్రతి రంగంపైనా కొత్త నిబంధనలు అమలయ్యాయి. ఒకప్పుడు కాబూల్ వీధుల్లో ఉద్యోగాలకు వెళ్లిన మహిళలు ఇప్పుడు అదే వీధిని కిటికీ నుంచి మాత్రమే చూస్తున్నారు.
కలలకు కూడా తాళం పడింది
ప్రపంచంలో మహిళలు పురుషులతో సమానం అన్నిరంగాల్లో విజయం సాధిస్తున్నారు. అంతరిక్షంలో ఆరు నెలలు గడిపిని వారిలో మహిళ కూడా ఉండడం గమనించవచ్చు. అలాంటి రోజులు ప్రపంచంలో నడస్తున్న తరుణంలో ఆంక్షలతో మహిళలను అణగదొక్కే ఏకైక దేశం ఆఫ్ఘానిస్థాన్ అని చెప్పక తప్పదు. తాలిబాన్ ప్రభుత్వం ఆంక్షలతో అక్కడి మహిళల కలలకు కూడా తాళం పడింది. కాబూల్‌కు చెందిన ఓ యువతి చిన్నప్పటి నుంచి పైలట్ కావాలని కలగంది. ఆకాశంలో విమానం కనిపించినప్పుడల్లా ఒక రోజు తానే నడుపుతానని ఊహించుకునేది. ఆన్లైన్లో చదువు పూర్తి చేసినా, విశ్వవిద్యాలయాల తలుపులు మూసుకుపోవడంతో ఆమె ప్రయాణం అక్కడే ఆగిపోయింది. ఆమె ఒక్కరే కాదు. యునెస్కో అంచనా ప్రకారం లక్షలాది బాలికలు సెకండరీ విద్యకు దూరమయ్యారు. ఐదేళ్లుగా స్కూల్ గడియారం మోగినా.. ఆఫ్ఘాన్ బాలికల కోసం తరగతి గదుల తలుపులు మాత్రం తెరుచుకోలేదు.
ఇంటి బయటకు వెళ్లడమే పెద్ద గగనం
ఐక్యరాజ్యసమితి సర్వే నిర్వహించింది. 3,200 మంది మహిళలపై నిర్వహించిన సర్వే మరింత భయానక వాస్తవాన్ని బయటపెట్టింది. సగానికి పైగా మహిళలు నెలలో ఒక్కటి లేదా రెండుసార్లు మాత్రమే ఇంటి బయటకు వెళ్తున్నారు. 10 మందిలో ఏడుగురు తమ మానసిక ఆరోగ్యం “చాలా దారుణంగా ఉంది” అని చెప్పారు. సామాజిక జీవితం పూర్తిగా కుంచించుకుపోయిందని మహిళలు తెలిపారు. ఇది కేవలం స్వేచ్ఛ కోల్పోవడం కాదు. ఇది మెల్లగా సమాజం నుంచి మహిళలను అదృశ్యమయ్యేలా చేసే ప్రక్రియ అని మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి.
కొరడా దెబ్బల కంటే లోతైన గాయం భయమే
ఓ మహిళ పురుషులతో మాట్లాడింది అనే ఆరోపణతో బహిరంగంగా 50 కొరడా దెబ్బలు కొట్టారు. ఆమె శరీరంపై గాయాలు మానిపోయాయి. కానీ ఆమె చిన్న కుమార్తె ప్రతి రాత్రి ‘అమ్మా.. వాళ్లు మళ్లీ నిన్ను కొడుతున్నారు అని ఏడుస్తుంది. ఆ గాయం ఎప్పటికీ మానదు. అలాగే మరో మహిళ తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకోవడంతో 39 కొరడా దెబ్బలు, జైలు శిక్ష అనుభవించింది. మహిళల శరీరంపై పడిన శిక్షల కంటే, వారి కుటుంబాల మనసులపై పడిన గాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రసూతి గదిలో కూడా ప్రాణాలతో పోరాటమే
ఆఫ్ఘానిస్తాన్ ప్రపంచంలోనే అత్యధిక మాతృ మరణాల రేటు ఉన్న దేశాల్లో ఒకటి. దేశ ఆరోగ్య వ్యవస్థ దుస్థితి చాలా దారుణంగా ఉంది. దూర గ్రామం నుంచి వచ్చిన ఆరుగురు పిల్లల తల్లి ప్రసవ సమయంలో మరణించింది. శిశువును కాపాడగలిగారు. కానీ ఆ ఆరుగురు పిల్లల భవిష్యత్తు ఎవరూ కాపాడలేకపోయారు.
గర్భిణుల్లో ఆందోళన
తన కడుపులో ఉన్నది ఆడబిడ్డ అయితే ఇక్కడ బతక గలదా? అనేది గర్భిణుల్లో రోజురోజుకు పెరుగుతున్న మానసిక ఆందోళన. ఒక వేళ ఆడబిడ్డ అయితే స్కూల్ ఉండకపోతే? మహిళా డాక్టర్ లేకపోతే? పరిస్థితి ఏమిటని ఆందోళనలు వెంటాడుతున్నాయి.
తాలిబాన్ వాదన ఏమిటి?
అంతర్జాతీయ విమర్శల మధ్య తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ మాత్రం వేరే చిత్రాన్ని చూపిస్తున్నారు. మహిళలపై పూర్తిస్థాయి నిషేధం లేదని, ప్రస్తుతం 30 లక్షల బాలికలు పాఠశాలలు, మదరసాల్లో చదువుతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఐరాస, యునెస్కో, మానవ హక్కుల సంస్థలు మాత్రం సెకండరీ విద్య, విశ్వవిద్యాలయ ప్రవేశం, అనేక ఉద్యోగాలపై నిషేధాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి. అందుకే తాలిబాన్ అధికారిక వాదనకూ, మహిళల అనుభవాలకూ మధ్య పెద్ద అంతరం కనిపిస్తోంది.
ప్రపంచం ముందు నిలిచిన ప్రశ్న
ఐదేళ్ల తాలిబాన్ పాలన తర్వాత ఆఫ్ఘానిస్థాన్‌లో మహిళల భవిష్యత్తు రెండు కీలక అంశాలపై నిలిచింది. ఒకటి తాలిబాన్ విధానాలు మారుతాయా? రెండోది అంతర్జాతీయ సమాజం మహిళలకు అందిస్తున్న సహాయం కొనసాగుతుందా?
సంఘీభావం కావాలి
“ఆఫ్ఘాన్ మహిళల కోసం మాట్లాడండి. మా విద్య, ఉద్యోగ హక్కులకు మద్దతివ్వండి. మాకు మౌనం కాదు.. సంఘీభావం కావాలి.” అని అక్కడి విద్యావంతులైన మహిళలు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అక్కడ ప్రభుత్వ ఆలోచేన మారుతుందో, లేదో వేచి చూడాలి!
