తుకారం మృతి సమాజానికి తీరనిలోటు..
జైనూర్/సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : జర్నలిజంలో ఎన్నో సేవలు అందించడంతో పాటు ఆర్‌ఎంపీ వైద్యుడిగా కూడా సేవలందించిన ఆత్రం తుకారం (58) హఠాన్మరణం ఆదివాసీ, పాత్రికేయ సమాజాలకు తీరనిలోటని ప్రజాప్రతినిధులు, నాయకులు, జర్నలిస్టులు అన్నారు. సిర్పూర్ (యు) మండల కేంద్రానికి చెందిన ఆత్రం తుకారం శుక్రవారం రాత్రి హఠాత్తుగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, జర్నలిస్టులు శనివారం సాయంత్రం ఆయన పార్థివదేహానికి సంప్రదాయబద్ధంగా నివాళులర్పించారు.
ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యామ్ నాయక్, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్‌రావు, జర్నలిస్టుల సంఘాల జిల్లా అధ్యక్షులు రవినాయక్, అబ్దుల్ రహమాన్, ఆసిఫాబాద్, కెరమెరి, జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్, తిర్యాని మండలాల జర్నలిస్టుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు, ఆదివాసీ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుకారం చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన మృతి సమాజానికి తీరనిలోటని అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తుకారం కుటుంబాన్ని ఆదుకోవాలని సంఘాల నాయకులు, జర్నలిస్టులు కోరారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ (యు) మాజీ ఎంపీపీ ఆత్రం భగవంతురావు, గ్రామ పటేల్ ఆశ్రమం ఆనందరావు, తెరమేరి మాజీ జెడ్పీటీసీ అబ్దుల్ కలాం, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు.
