Ben Stokes | మద్యం మత్తులో వీరంగం.. ఈసీబీ షాక్?

Ben Stokes | మద్యం మత్తులో వీరంగం.. ఈసీబీ షాక్?

ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) వివాదంలో చిక్కుకున్నాడు. సహచర ఆటగాడు గస్ అట్కిన్సన్‌తో (Gus Atkinson) కలిసి జట్టు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో ఇద్దరూ దోషులుగా తేలితే క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు బ్రిటిష్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

అసలేం జరిగిందంటే?

లండన్‌లో న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో విజయం సాధించిన తర్వాత బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ అర్ధరాత్రి ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లినట్లు సమాచారం. అక్కడ సారాసెన్స్ అకాడమీకి చెందిన ఓ రగ్బీ ఆటగాడితో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు బ్రిటిష్ మీడియా పేర్కొంది. ఈ ఘర్షణలో అట్కిన్సన్‌పై ఆ ఆటగాడు చేయి చేసుకోగా, అది పొరపాటున ఇంగ్లండ్ జట్టు భద్రతా సిబ్బందిలో ఒకరికి తగిలినట్లు తెలుస్తోంది. గాయపడిన సెక్యూరిటీ సిబ్బందికి వెంటనే వైద్యం అందించారు. అయితే ఈ ఘటనలో స్టోక్స్ లేదా అట్కిన్సన్ ఎవరిపైనా ప్రత్యక్షంగా దాడి చేసినట్లు ఆధారాలు లేవని ఈసీబీ వర్గాలు తెలిపినట్లు కథనాలు పేర్కొన్నాయి.

ఈసీబీ సీరియస్..

ఈ ఘటనను ఈసీబీ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. జూన్ 17 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు ముందు విచారణ పూర్తి చేసే ప్రయత్నంలో బోర్డు ఉన్నట్లు సమాచారం. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ పాల్గొన్నారని, పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని ఈసీబీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ విషయాన్ని క్రికెట్ రెగ్యులేటర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొంది.

కెప్టెన్సీపై కూడా చర్చ?

ఈ ఘటన నేపథ్యంలో బెన్ స్టోక్స్‌పై క్రమశిక్షణ చర్యలు ఉండొచ్చని బ్రిటిష్ మీడియా కథనాలు చెబుతున్నాయి. అవసరమైతే కెప్టెన్సీ అంశాన్ని కూడా ఈసీబీ పరిశీలించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. ఒకవేళ స్టోక్స్ అందుబాటులో లేకపోతే హ్యారీ బ్రూక్ తాత్కాలికంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు ఈసీబీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

గతంలోనూ ఇలాంటి వివాదాలు..

ఇంగ్లండ్ ఆటగాళ్లు రాత్రివేళల్లో క్రమశిక్షణ ఉల్లంఘించిన ఘటనలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటన సమయంలో వచ్చిన వివాదాల తర్వాత అర్ధరాత్రి తర్వాత ఆటగాళ్లు బయటకు వెళ్లకుండా ఈసీబీ ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చింది. ఇప్పుడు అదే నిబంధనలను స్టోక్స్, అట్కిన్సన్ ఉల్లంఘించారనే ఆరోపణలు రావడం ఇంగ్లండ్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విచారణ పూర్తయ్యాకే ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.