డెలివరీ బాయ్‌ల ఆవేదన.. కలెక్టర్‌కు వినతి!

డెలివరీ బాయ్‌ల ఆవేదన.. కలెక్టర్‌కు వినతి!

స్విగ్గీ గిగ్ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్

గుంటూరు, ఆంధ్రప్రభ: గుంటూరు నగరంలో పనిచేస్తున్న స్విగ్గీ ఫుడ్ డెలివరీ గిగ్ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ అనుబంధ ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. ముత్యాలరావు మాట్లాడుతూ, ప్రస్తుతం ఫుడ్ డెలివరీ కార్మికుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు. మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో వాహనాల నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు, పిల్లల విద్యా ఖర్చులు, వైద్య వ్యయాలు పెరగడంతో గిగ్ వర్కర్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కార్మికుల సమస్యలపై స్విగ్గీ యాజమాన్యం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి ఫుడ్ డెలివరీకి మొత్తం ప్రయాణించిన కిలోమీటర్ల ఆధారంగా కనీసం కిలోమీటర్‌కు రూ.15 చెల్లించాలని డిమాండ్ చేశారు.

మల్టీ ఆర్డర్లలో ప్రతి ఆర్డర్‌కు పూర్తి సర్జ్ అమౌంట్ ఇవ్వాలని, లాంగ్ డిస్టెన్స్ డెలివరీల అనంతరం తిరిగి వచ్చే కిలోమీటర్లకు కూడా రిటర్న్ పే చెల్లించాలని కోరారు.

అలాగే కస్టమర్ ఆర్డర్ రద్దు చేసిన సందర్భాల్లో కనీసం 50 శాతం అదనపు పారితోషికం ఇవ్వాలని, రెస్టారెంట్‌ల వద్ద ఫుడ్ కోసం వేచి ఉండే సమయానికి నిమిషానికి రూ.1 వెయిటింగ్ ఛార్జీ చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రమాదాలకు గురైన గిగ్ వర్కర్లకు ఎలాంటి రేటింగ్ నిబంధనలు లేకుండా పూర్తి బీమా సదుపాయం కల్పించాలని కోరారు. గిగ్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని బి. ముత్యాలరావు విజ్ఞప్తి చేశారు.