శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ మండల పూజ సీజన్, మకరవిళక్కు మహోత్సవం కోసం ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు విస్తృత ఏర్పాట్లు ప్రారంభించింది. భక్తుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని నవంబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ వర్చువల్ క్యూ బుకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేనుంది.
మండల పూజ సీజన్ నవంబర్ 16న ప్రారంభం కానుండగా, ఆలయ తలుపులు నవంబర్ 15 సాయంత్రం 5 గంటలకు తెరవనున్నారు. మండల పూజలు డిసెంబర్ 27 వరకు కొనసాగి, డిసెంబర్ 30 నుంచి మకర పూజలు మొదలవుతాయి. మకర మహోత్సవం డిసెంబర్ 30 నుంచి జనవరి 14 వరకు జరగనుండగా.., మకర విళక్కు ముగింపు పూజలు జనవరి 20న జరుగుతాయి.
ఇదిలా ఉంటే, ఈ ఆన్‌లైన్ వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా రోజుకు గరిష్టంగా 70,000 మంది భక్తులకు, అదనంగా 20,000 మందికి స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనావకాశం కల్పించనున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు, వారికి విశ్రాంతి కల్పించేందుకు పంబా వద్ద దాదాపు 10,000 మంది ఒకేసారి విశ్రమించేలా భారీ పందిరి నిర్మాణం జరుగుతోంది. అలాగే, సుమారు 50 లక్షల అరవణ ప్రసాదం బాటిళ్లను సిద్ధం చేస్తున్నారు.

