దేశంలో ఎల్పీజీ వినియోగం 16 శాతం తగ్గుదల
దేశంలో ఎల్పీజీ వినియోగం 16 శాతం తగ్గుదల
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంలోని ఎల్పీజీ వినియోగంపై పడింది. హార్మూజ్ జలసంధి దిగ్బంధనం, కువైట్‌పై ఇరాన్ దాడులతో గ్యాస్ సరఫరాలు భారీగా తగ్గాయి. ఇతర దేశాల నుంచి భారత్ గ్యాస్ దిగుమతులు పెంచుకుంటున్నప్పటికీ, దేశంలో పూర్తి స్థాయిలో సరఫరాలు జరగడం లేదు.
ప్రాధాన్యతల ప్రకారం ప్రభుత్వం గ్యాస్ సరఫరాలు నిర్వహిస్తోంది. గృహ వినియోగానికి వంద శాతం కేటాయింపులు చేసింది. పరిశ్రమలకు వారి గత వినియోగాన్ని బట్టి కేటాయింపులు చేస్తోంది. అయితే కమర్షియల్ వినియోగదారులకు పూర్తిస్థాయిలో సరఫరాలు జరగడం లేదు. దీంతో ఏప్రిల్ నెలలో దేశంలో గ్యాస్ వినియోగం ఏకంగా 16 శాతం తగ్గింది.
దేశంలో ఏప్రిల్ నెలలో ఎల్పీజీ వినియోగం 2.2 మిలియన్ టన్నులుగా నమోదైంది. గత సంవత్సరం ఏప్రిల్‌లో వినియోగించిన 2.62 మిలియన్ టన్నులతో పోల్చితే ఇది 16.16 శాతం తక్కువ. 2024 ఏప్రిల్‌లో నమోదైన 2.45 మిలియన్ టన్నులతో పోల్చితే కూడా ఈసారి వినియోగం 10.5 శాతం తగ్గింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) డేటా ప్రకారం, మార్చి నెలతో పోల్చినా వినియోగం తగ్గింది. 2026 మార్చిలో 2.379 మిలియన్ టన్నుల వినియోగం నమోదవగా, ఏప్రిల్‌లో అది మరింత తగ్గింది.
భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతి చేసుకుంటోంది. అందులో ఎక్కువ భాగం హార్మూజ్ జలసంధి ద్వారా వస్తుంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో, ఇరాన్ ఈ జలసంధిని మూసివేసింది. అలాగే కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలపై దాడులు జరగడంతో చమురు క్షేత్రాలు, గ్యాస్ ప్లాంట్లు దెబ్బతిన్నాయి.
దీంతో ఈ దేశాల నుంచి గ్యాస్, చమురు సరఫరాలు దాదాపు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రభుత్వం గృహ వినియోగదారులు, వాహనాల్లో ఉపయోగించే సీఎన్‌జీ, ఎల్పీజీ సరఫరాలను మాత్రమే పూర్తి స్థాయిలో కొనసాగించాలని నిర్ణయించింది. మిగతా రంగాలకు సరఫరాల్లో కోత పెట్టింది. దీనివల్ల దేశంలో గ్యాస్ వినియోగం గణనీయంగా తగ్గింది.
యుద్ధ ప్రభావంతో మార్చి నెలలోనే గ్యాస్ వినియోగం 12.8 శాతం తగ్గగా, ఏప్రిల్‌లో ఇంకా మరింత పడిపోయింది అని పీపీఏసీ వెల్లడించింది. ప్రభుత్వం స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంతో, వంటచెరకు వంటి కాలుష్యకారక ఇంధనాల స్థానంలో ఎల్పీజీ వినియోగం గతంలో వేగంగా పెరిగింది.
ఇదే సమయంలో గల్ఫ్ ప్రాంత గగనతలం మూసివేయడంతో, అనేక విమానయాన సంస్థలు తమ సేవలను రద్దు చేసుకున్నాయి. దీంతో గత సంవత్సరం ఏప్రిల్‌తో పోల్చితే ఈ సంవత్సరం విమాన ఇంధనం (ఏటీఎఫ్) వినియోగం 1.37 శాతం తగ్గి 7,61,000 టన్నులకు చేరింది. మార్చి నెలలో నమోదైన 8,07,000 టన్నులతో పోల్చినా ఏప్రిల్‌లో వినియోగం తగ్గింది.
ఎల్పీజీ, విమాన ఇంధనాలతో పాటు డీజిల్ అమ్మకాలపై కూడా ప్రభావం పడింది. ఏప్రిల్‌లో డీజిల్ అమ్మకాలు కేవలం 0.25 శాతం మాత్రమే పెరిగి 8.282 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. మార్చి నెలలో ఇవి 8.1 శాతం పెరిగి 8.727 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.
పెట్రోల్ అమ్మకాలు ఏప్రిల్‌లో 6.36 శాతం పెరిగి 3.67 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. అయితే మార్చిలో 7.6 శాతం పెరిగి 3.78 మిలియన్ టన్నులు నమోదయ్యాయి. దీంతో పోల్చితే ఏప్రిల్‌లో పెట్రోల్ వినియోగం తగ్గినట్లు తెలుస్తోంది.
