వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు జలాభిషేకం

భీమ్‌గల్ రూరల్ (ఆంధ్రప్రభ): వర్షాకాలం ప్రారంభమై దాదాపు నెలరోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం బాచన్‌పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ వెన్నెల బాలమణి (జనార్ధన్) ఆధ్వర్యంలో గ్రామస్తులు గురువారం హనుమాన్ ఆలయంలోని శివలింగం, నందికి జలాభిషేకం నిర్వహించి సకాలంలో వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు బిందెలతో ఆలయానికి చేరుకుని సామూహికంగా అభిషేకంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, వర్షాభావంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల జీవన విధానం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందన్నారు. భగవంతుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.