రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి రూరల్ (ఆంధ్రప్రభ): భూ భారతి ద్వారా చేపడుతున్న రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన భూ భారతి రీ-సర్వే అవగాహన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి పోర్టల్ ద్వారా ఇప్పటికే అనేక భూ సమస్యలు పరిష్కారమయ్యాయని, భూముల విస్తీర్ణంలో తేడాలు, ఇతర భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర రీ-సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో చివరిసారిగా 1937లో భూ సర్వే జరిగిందని, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని 190 రెవెన్యూ గ్రామాల్లో తొలి దశలో 70 గ్రామాలను రీ-సర్వేకు ఎంపిక చేశామని, వాటిలో సబ్బితం గ్రామం కూడా ఒకటని పేర్కొన్నారు. ముందుగా గ్రామ సరిహద్దులను నిర్ధారించి, అనంతరం ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులు, వ్యవసాయ భూములను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాల సహాయంతో సర్వే చేస్తామని చెప్పారు. సర్వే అనంతరం భూ వివరాలను గ్రామాల్లో ప్రకటించి ప్రజలకు 21 రోజుల గడువు ఇచ్చి అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించిన తర్వాత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి భూధార్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వేతో 99 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని వెల్లడించారు.
రీ-సర్వే జరుగుతున్న సమయంలో రైతులు, భూ యజమానులు తమ భూముల వద్ద అందుబాటులో ఉండి అధికారులకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. రోజుకు 40 నుంచి 50 ఎకరాల వరకు సర్వే నిర్వహిస్తామని, ఏ భూములను సర్వే చేయనున్నారనే సమాచారాన్ని ముందుగానే తెలియజేస్తామని చెప్పారు. ఈ రీ-సర్వే ద్వారా రూపొందించే భూ వివరాలు రాబోయే 60 నుంచి 70 సంవత్సరాల వరకు ఉపయోగపడతాయని, ఆధార్ తరహాలో భూధార్ కార్డుల జారీకి ఇది కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజయ్య, సర్పంచ్ నూనె సరోజన, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
