Asifabad గాలివాన గర్జన! అడ్డెసార పంచాయతీలో విధ్వంసం
Asifabad గాలివాన గర్జన! అడ్డెసార పంచాయతీలో విధ్వంసం
- మూడు గ్రామాల్లో ఇండ్లు, గుడిసెలు కూల్చివేత.. విద్యుత్ స్తంభాలు నేలమట్టం
జైనూర్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా (Asifabad) , ఆంధ్రప్రభ
జైనూర్ మండలంలోని అడ్డెసార పంచాయతీలో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో అడ్డెసార, పూనగూడ, వడ్డరుగూడ గ్రామాల్లో భారీ నష్టం సంభవించింది.
తీవ్ర గాలుల కారణంగా అనేక ఇండ్ల రేకులు ఎగిరిపడగా, గుడిసెలు కూలిపోయాయి. చెట్లు విరిగి నేలమట్టమయ్యాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయి.
అడ్డెసార సర్పంచ్ పంద్ర కౌశల్య సేకు గ్రామాల్లో పర్యటించి గాలివాన కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.
చాలా ఇళ్ల రేకులు లేచిపోవడంతో పాటు గుడిసెలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, నిరుపేద గిరిజనులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. అధికారులు వెంటనే గ్రామాల్లో సర్వే నిర్వహించి బాధితులకు నష్టపరిహారం అందించాలని ఆమె కోరారు.
విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో సరఫరా నిలిచిపోయిందని, పరిస్థితిని అంచనా వేయడానికి ఇంకా పూర్తిస్థాయి వివరాలు తెలియాల్సి ఉందని సర్పంచ్ తెలిపారు.
ప్రకృతి విపత్తుతో గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

