Appeal | తెలంగాణ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడుదాం – ఎంపిలకు డిప్యూటీ సిఎం భట్టి పిలుపు

అందరూ ఒకే మాట మీద ఉంటేనే కేంద్రంపై వ‌త్తిడి తేవ‌చ్చు
తెలంగాణ ఎంపీలతో మల్లు భట్టి విక్రమార్క సమావేశం
కేంద్రం నుండి రావాల్సిన నిధులపై చర్చ
హాజరైన అసదుద్దీన్ ఒవైసీ
బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరు
కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి సమస్యలను వివరించుదామన్న భట్టి

హైద‌రాబాద్ , ఆంధ్ర‌ప్ర‌భ – తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మన సమస్యలను వివరించాలని ఆయన అన్నారు. ఉన్నత భావాలతో ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసం పోరాడాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రజాభవన్‌లో భట్టి అధ్యక్షతన నేడు తెలంగాణ ఎంపీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరయ్యారు.
కేంద్రం వద్ద పెండింగులో ఉన్న బిల్లులపై ఈ సమావేశంలో చర్చించారు. మొత్తం దాదాపు 28 అంశాలపై సమావేశంలో చర్చించినట్లు భట్టి తెలిపారు. విభజన సమస్యలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

సమయాభావం వల్లే రాలేకపోతున్నాం …
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తో పాటు బిజెపి ఎంపిలందర్ని భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఖరారైన కార్యక్రమాలు ఉండటంతో తాము రాలేమని కిషన్ రెడ్డి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. అలాగే బిఆర్ ఎస్ పార్టీ సైతం ఆకస్మికంగా సమావేశం పెట్టడంతో హాజరుకాలేకపోతున్నామని , మరోసారి
ఇటువంటి సమావేశం నిర్వహిస్తే ముందుగానే సమాచారం ఇవ్వాలని భట్టిని ఆ పార్టీ కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *