ఏపీఎల్‌లో అమరావతి హ్యాట్రిక్..

ఏపీఎల్‌లో అమరావతి హ్యాట్రిక్..

వైజాగ్‌కు తొలి విజయం

శశికాంత్ ఆల్‌రౌండ్ మెరుపులు.. భీమవరంపై రాయల్స్ విజయం

వీరారెడ్డి విధ్వంసం.. విజయవాడపై లయన్స్ ఘన గెలుపు

విశాఖపట్నం, (ఆంధ్రప్రభ): ఏపీఎల్-2026 సీజన్-5లో ఆరో రోజు జరిగిన మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు భారీ స్కోర్లు, ఉత్కంఠభరిత పోరుతో అలరించాయి. తొలి మ్యాచ్‌లో క్యాపిటల్ అమరావతి రాయల్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి హ్యాట్రిక్ కొట్టగా, రెండో మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది.

శశికాంత్ ఆల్‌రౌండ్ షో.. అమరావతికి హ్యాట్రిక్

భీమవరం బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్ అమరావతి రాయల్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన అమరావతి జట్టుకు ఓపెనర్లు ఆశించిన ఆరంభం ఇవ్వకపోయినా, వెంకట రాహుల్ (43), కరన్ షిండే (33), కోడి వెంకట శశికాంత్ (38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

వర్షం కారణంగా మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించగా, అమరావతి 18.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. భీమవరం బౌలర్లలో సత్యనారాయణ రాజు మూడు వికెట్లు, సాయి శ్రవణ్ రెండు వికెట్లు పడగొట్టారు.

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్‌కు హేమంత్ రెడ్డి (59), సాయి శ్రవణ్ (40) పోరాడినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. నిర్ణీత 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులకే పరిమితమై ఓటమి పాలయ్యారు.

బ్యాట్‌తో రాణించడంతో పాటు బంతితోనూ కీలక పాత్ర పోషించిన కోడి వెంకట శశికాంత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

వీరారెడ్డి విధ్వంసం.. వైజాగ్‌కు తొలి విజయం

రోజులో జరిగిన రెండో మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్ 67 పరుగుల తేడాతో విజయవాడ సన్ షైనర్స్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన విజయవాడ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్ చేసిన వైజాగ్ లయన్స్ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు.

హిమకర్ (33), కెప్టెన్ రికీ భుయ్ (39) వేగవంతమైన ఆరంభాన్ని అందించగా, కె. హనీష్ వీరారెడ్డి కేవలం 40 బంతుల్లో 79 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. దీంతో లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విజయవాడ సన్ షైనర్స్‌కు అశ్విన్ హెబ్బార్ (55), హర్షవర్ధన్ (30) కొంత ప్రతిఘటన చూపినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఫలితంగా ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమితమైంది.

బ్యాట్‌తో మెరిపించడమే కాకుండా బంతితోనూ ప్రభావం చూపిన కె. హనీష్ వీరారెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అతడి అద్భుత ప్రదర్శనతో వైజాగ్ లయన్స్ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది.

Leave a Reply