AP | అన్నదాత అవస్థలు..

AP | అన్నదాత అవస్థలు..
AP, కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండలంలో ధాన్యం కొనుగోలు చేసేవారు లేక రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. దిత్వా తుఫాన్ (Ditwah Cyclone) నేపథ్యంలో వరి యంత్రాలతో కోసిన ధాన్యం కొనుగోలుదారులు కరువువయ్యారు. రోడ్లపైనే ధాన్యం నిల్వ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోడూరు మండల వ్యాప్తంగా 15 వేల ఎకరాలలో ఖరీఫ్ సాగు చేయగా కోడూరు కృష్ణాపురం, సాలెం పాలెం, పిట్టలంక, నరసింహపురం, ఉల్లిపాలెం, లింగారెడ్డిపాలెం, నక్కవానిదారి, జరుగువానిపాలెం, వి.కొత్తపాలెం, మందపాకల, పాదాలవారిపాలెం.. గ్రామాలలో ప్రస్తుతం వరి కోతలు ముమ్మురంగా సాగుతున్నాయి. వాతావరణ మార్పులు కారణంగా రైతులు భయాందోళనతో వరి కోత యంత్రాల సహాయంతో వరి కోతలు కోస్తున్నారు.
ఒకేసారి వేలాది ఎకరాలలో యంత్రాల ద్వారా వరి కోతలు కోయడంతో పలు గ్రామాలలో ఎటు చూసినా రోడ్ల పైన ధాన్యం గుట్టలు, ధాన్యం బస్తాలే కనిపిస్తున్నాయి. రైతు సేవా కేంద్రాల ద్వారా గోతాలు ఇవ్వగా ధాన్యం కాటాలు వేసినప్పటికీ, మిల్లర్ల వద్ద దిగుమతి చేసుకొనే ఖాళీ లేక కాటాలు వేసి మూడు రోజులైనప్పటికీ రోడ్లపైనే ధాన్యం నిలిచిపోయాయని రైతులు వాపోతున్నారు. ప్రైవేట్ మార్కెట్లో ధాన్యం అమ్ముకుందామంటే 1400 రూపాయలకే అడుగుతున్నారని తెలుపుతున్నారు. 1400 కి అమ్ముకుందామన్న ధాన్యం కాటాలు వెయ్యాలి అంటే.. రెండు రోజులు ఆగాలని ప్రైవేటు వ్యాపారులు చెప్తున్నారని రైతులు తెలుపుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపించి రైతుల వద్ద ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా వెంటనే కొనుగోలు చేసి తీసుకు వెళ్లే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు కోడూరు మండలంలో 245 మెట్రిక్ ధాన్యాన్ని రైతులు వద్ద కొనుగోలు చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

