కదిరిలో ఘనంగా “ఆపరేషన్ క్లీన్ స్వీప్

కదిరిలో ఘనంగా “ఆపరేషన్ క్లీన్ స్వీప్

శ్రీ సత్య సాయి బ్యూరో ,ఆంధ్రప్రభ : కదిరి పట్టణంలో పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభం పలికారు. అనంతరం మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణ ప్రధాన రహదారులపై స్వయంగా చీపురు పట్టి శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పరిశుభ్రత యొక్క ప్రాధాన్యతను వివరించారు. “ఒక రాష్ట్రం – ఒక పరిశుభ్రత” అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రతి పౌరుడు తమ ఇల్లు మాత్రమే కాకుండా చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.

పరిశుభ్రమైన వాతావరణం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని, ప్రజల సహకారంతోనే ఆరోగ్యకరమైన పట్టణ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో శానిటేషన్ కార్మికుల సేవలు ఎంతో గొప్పవని కొనియాడుతూ వారికి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్వచ్చంద్ర డైరెక్టర్ పర్వీన్ భాను, టిడిపి పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, టిడిపి నాయకులు కేఎస్ బహవుద్దీన్, పలువురు మాజీ కౌన్సిలర్లు, టిడిపి నాయకులు, మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ కార్మికులు, వార్డు ప్రజాప్రతినిధులు, యువకులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని పట్టణ పరిశుభ్రతకు తమ వంతు సహకారం అందించారు.

Leave a Reply