రథసారథి: జీవన రథానికి దైవమే నిజమైన సారథి
రథసారథి: జీవన రథానికి దైవమే నిజమైన సారథి
చతురంగ బలాలు – ప్రాచీన భారతీయ యుద్ధ వ్యవస్థ
రథికుడు–సారథి సమన్వయం విజయానికి మూలం
మానవ జీవితం ఒక రథం – దైవమే సారథి
విశ్వాసం, భక్తితోనే జీవన సాఫల్యం
ప్రాచీన భారతీయ యుద్ధ వ్యవస్థలో సైన్యం చతురంగ బలాలుగా విస్తరించి ఉండేది. అశ్వబలం, గజబలం, రథబలం, కాల్బలం అనే నాలుగింటినీ చతురంగ బలాలు అనేవారు. గుర్రాలనెక్కి యుద్ధం చేసే వీరులు అశ్వబలంగా, ఏనుగులపై ఎక్కి యుద్ధం చేసే శూరులు గజబలంగా, రథాలను అధిరోహించి పోరాడే రథికులు రథబలంగా, ఏ వాహనమూ లేకుండా యుద్ధం చేసే సైనికులు కాల్బలంగా వ్యవహరింపబడేవారు. యుద్ధంలో పాల్గొనే గుర్రాలకు, ఏనుగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడేది. రథాలకు గుర్రాలను పూన్చి, సారథులు వాటిని నడుపుతూ రథికులకు తోడ్పడేవారు. రథికులకు, రథసారథులకు మధ్య, కృష్ణార్జునులవలె, చక్కని సమన్వయం ఉంటే విజయం నల్లేరుపై బండి నడకలా సులభ సాధ్యమయ్యేది. అలా కాకుండా శల్యుడు కర్ణునిలాగా వారి మధ్య సమన్వయం లోపిస్తే విజయం అందని ద్రాక్షపండులా దూరమయ్యేది.
ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తే మానవ దేహం ఒక రథం. దానిని ఆలంబనగా చేసుకొని జీవన పోరాటం చేస్తున్న జీవుడు రథికుడు. రథాన్ని నడిపే సారథి దేవుడు. ఆ పరమాత్మ నిర్దేశికత్వంలోనే, అంటే సారథ్యంలోనే, బతుకు బండి నడుస్తుంది. ఆయనపై విశ్వాసముంచి, ఆయన చూపుతున్న ధర్మపథంలో ముందుకు సాగుతుంటేనే జీవన సాఫల్యం, ముక్తి ఫలం లభిస్తాయి. సూత్రధారికి పాత్రధారి ఎదురు తిరిగితే నాటకం ఎలా రసాభాసగా మారుతుందో, సారథిపై నమ్మకం లేకపోతే రథికునికి అంత ఇబ్బంది ఏర్పడుతుంది. జీవన సారథియైన భగవంతునిపై విశ్వాసం, భక్తి లేకపోతే జీవుని పయనం గతుకుల బాటలో సాగి అథోగతి పాలవుతుంది. కనుక రథికుడైన జీవుని బలం సారథియైన దైవమే!
“బలయుతులకు, దుర్బలులకు, బలమెవ్వడు; నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు; ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్రా!” అన్న ప్రహ్లాదుని మాటను అనుసరించి దైవబలాన్ని, విశ్వసించి మనమందరం ముందుకు సాగుదాం.
– గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి
