నందిగామలో వైసీపీ బూత్ కన్వీనర్ల సమావేశం

నందిగామలో వైసీపీ బూత్ కన్వీనర్ల సమావేశం
-ఎన్నికల సన్నద్ధతపై పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం
-బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యమన్న నేతలు
-ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలు తీసుకెళ్లాలని పిలుపు
-సమన్వయంతో పనిచేస్తే విజయమేనని నాయకుల నమ్మకం
నందిగామ, ఆంధ్రప్రభ:
మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు ఆధ్వర్యంలో నందిగామ నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ , ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ , రీజినల్ ఇంచార్జ్ కందుల రవీంద్ర రెడ్డి , రాష్ట్ర పోలింగ్ బూత్ వింగ్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి , అసెంబ్లీ పరిశీలకుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల సన్నద్ధత, బూత్ స్థాయిలో సంస్థాగత బలోపేతం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ సిద్ధాంతాలు, గత ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరేలా పనిచేయాల్సిన ప్రధాన బాధ్యత బూత్ కన్వీనర్లదేనని నేతలు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ పార్టీపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం బూత్ కన్వీనర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ బూత్ నిర్వహణ, ఓటర్లతో సంబంధాలు, పార్టీ కార్యక్రమాల అమలు, స్థానిక సమస్యలపై స్పందన, సామాజిక మాధ్యమాల వినియోగం వంటి అంశాలపై నాయకులు సమగ్ర దిశానిర్దేశం చేశారు.
నందిగామ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని నాయకత్వం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.
