మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు..

  • పాత నోట్లు రద్దు చేస్తారా?
  • పాలిమర్‌ నోట్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌..

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : దేశ కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. సాధారణ కాగితపు నోట్లకు ప్రత్యామ్నాయంగా పాలిమర్‌ (ప్లాస్టిక్‌) నోట్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. తొలిదశలో రూ.10, రూ.20 విలువైన పాలిమర్‌ నోట్లను క్షేత్రస్థాయి పరిశీలన కోసం చలామణిలోకి తీసుకురావడానికి అనుమతి ఇచ్చింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌కు లిఖితపూర్వకంగా వెల్లడించారు. అయితే ఇవి ప్రయోగ దశలో మాత్రమే ఉంటాయని, ఫలితాలను పరిశీలించిన తర్వాతే పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

ప్రయోగ దశలో రెండు బిలియన్‌ నోట్లు..

ఆర్‌బీఐ చట్టం-1934లోని సెక్షన్‌ 25 ప్రకారం ఆర్‌బీఐ బోర్డు ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. దీనికి అనుమతి లభించడంతో తొలిదశలో రూ.10, రూ.20 పాలిమర్‌ నోట్లు చెరో 100 కోట్ల చొప్పున.. మొత్తం 200 కోట్ల నోట్లను ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. క్షేత్రస్థాయి పరీక్షలు విజయవంతమైతే సాధారణ కాగితపు నోట్లతో పాటు పాలిమర్‌ నోట్లు కూడా దేశవ్యాప్తంగా చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది.

పాత నోట్లు రద్దు అవుతాయా?

పాలిమర్‌ నోట్లు వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లు రద్దు చేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పాత నోట్లను ఉపసంహరించే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలిమర్‌ నోట్లు అందుబాటులోకి వచ్చినా.. కాగితపు నోట్లు, కొత్త పాలిమర్‌ నోట్లు రెండూ ఒకేసారి చలామణిలో కొనసాగుతాయని తెలిపింది. ప్రస్తుతం పాలిమర్‌ నోట్ల తయారీ ప్రక్రియ ప్రారంభ దశలోనే ఉందని, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే విషయంపై ఇప్పుడే స్పష్టత లేదని ప్రభుత్వం పేర్కొంది.

పాలిమర్‌ నోట్ల ప్రత్యేకతలు ఏంటి?

కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్‌ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. నీరు, చెమట, మడతలు పడటం వంటి కారణాలతో కాగితపు నోట్లు త్వరగా పాడవుతాయి. కానీ పాలిమర్‌ నోట్లు వాటిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. నిపుణుల ప్రకారం.. పాలిమర్‌ నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే 2.5 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలం ఉపయోగపడే అవకాశం ఉంది. తక్కువ విలువ కలిగిన రూ.10, రూ.20 నోట్లు ఎక్కువగా చేతులు మారుతుంటాయి. దీంతో అవి త్వరగా చిరిగిపోవడం, మురికిగా మారడం జరుగుతుంది. ఈ సమస్యకు పాలిమర్‌ నోట్లు పరిష్కారంగా మారే అవకాశం ఉంది.

నకిలీ నోట్లకు చెక్‌ పడుతుందా?

పాలిమర్‌ నోట్లలో అధునాతన భద్రతా లక్షణాలను పొందుపరిచే అవకాశం ఉంటుంది. పారదర్శక విండోలు, ప్రత్యేక గుర్తులు వంటి భద్రతా అంశాలతో వీటిని తయారు చేయవచ్చు. దీంతో నకిలీ నోట్ల తయారీని అడ్డుకునే అవకాశం పెరుగుతుంది. అయితే పాలిమర్‌ నోట్ల తయారీ ఖర్చు, ప్రజల వినియోగ అలవాట్లు, నిర్వహణ వంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని పలు దేశాలు ఇప్పటికే పాలిమర్‌ కరెన్సీని ఉపయోగిస్తున్నాయి. భారత్‌లోనూ ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని విలువల నోట్లను పాలిమర్‌ రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉంది.